కృష్ణ కాలనీ, డిసెంబర్ 1 : బీసీ ఉద్యమాన్ని రాష్ట్రంలోని బీసీల గడపగడపకూ తీసుకెళ్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటలెక్చువల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ టీ చిరంజీవులు పేర్కొన్నారు. బీసీ ఇంటలెక్చువల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ నాయకులు పైడిపల్లి రమేశ్, దాసరి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయంలో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోపాటు బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ.. 61శాతం బీసీ జనాభా ఉండి రాష్ట్రంలో రాజ్యాధికారం అందుకోలేకపోవడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్ర కులస్తులకు ఓటు వేసి మోచేతి నీళ్లకు ఆశపడొద్దని చెప్పారు. బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి తామంతా ఒకటే బీసీ కులం అనే నినాదంతో ఉద్యమించి హకులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గాజర్ల అశోక్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.