హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): మైక్రో ఫైనాన్స్ కుంభకోణం కేసులో సింగర్ మంగ్లీకి సంబంధాలున్నట్లు వస్తున్న ఆరోపణలు ఒక్కొక్కటి వాస్తవాలుగా తేలుతున్నాయి. తాజాగా మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో శివ ఖాతాలోకి ఈ సామ్లో ప్రధాన నిందితుడైన రమావత్ మధు నుంచి భారీగా నగదు బ దిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మధు బ్యాంకు ఖాతాలను పోలీసులు జప్తు చేశారు.
మధు ఖాతా నుంచి మూడు విడతలుగా శివ చౌహాన్ అకౌంట్లోకి నిధులు మళ్లాయని, డబ్బులు జమ అయిన మరుసటి రోజే ఆ మొత్తాన్ని శివ విత్డ్రా చేసినట్లు ఈవోడబ్ల్యూ విచారణలో తేలింది. దీంతో మధు, శివ చౌహాన్, హిమకాంత్ రెడ్డి బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని పోలీసులు బ్యాంకులకు లేఖ రాశారు. ఈవోడబ్ల్యూ పోలీసులు మంగ్లీ ఖాతాలను కూడా పరిశీలించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.