హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్టుగా ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న ట్రైనర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. మూడు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టింది. దీనిపై ఆ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెగింది. జీతాల కోసం వారు మంగళవారం మల్లేపల్లిలోని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలని, గౌరవప్రదమైన జీతాలివ్వాలని, మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని తెలంగాణ ఎంపవర్డ్ జాయింట్ అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ధర్నాతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ఒక నేల వేతనం చెల్లించారు. రాష్ట్రంలోని 65 ఏటీసీల్లో 467 మంది ఏటీవోలు పనిచేస్తున్నారు. ఐటీఐలలో అడ్మిషన్స్ నుంచి ప్లేస్మెంట్స్ చూస్తున్నారు. వారికి అధికారులు 2 నెలల వేతనాలు పెండింగ్ పెడుతున్నారు. ఆ వేతనాలను వరుసగా తదుపరి నెలలకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ అరకొర వేతనాలు కూడా సక్రమంగా రావడం లేదని, సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టు తమకు ఏ నెలలోనూ ఒకటో తేదీన వేతనం అందలేదని ఉద్యోగులు వాపోతున్నారు.