హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సు ల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్(టీజీ పీఈసెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. బీపీఈడీలో 1,307 మంది పరీక్ష రాయగా 1,257 మంది(95.79%), డీపీఈడీలో 460 మందికి 426 మంది అభ్యర్థులు(92.61%) క్వాలిఫై అయ్యారు.
బీపీఈడీ కోర్సు టాపర్‌గా ములుగు జిల్లాకు చెందిన ఎస్ జ్యోతిర్మయి నిలిచారు. కేతావత్ రజిత రెండో ర్యాంకు, కే అచ్యుత కుమారి మూడో ర్యాంకు సాధించారు. డీపీఈడీలో టీ సీతామహాలక్ష్మి మొదటి ర్యాంకు, ముడావత్ నిఖిత రెండో ర్యాంకు, సమినా బేగం మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. రెండు కోర్సుల్లో తొలి మూడు ర్యాంకులు మహిళలే సాధించడం గమనార్హం. అధికారిక సమాచారం ప్రకారం జూలై మూడో వారంలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.