హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ (జీవితకాలం) ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటవుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2011 ఫిబ్రవరి 11న విడుదలచేసిన టెట్ మార్గదర్శకాల అనంతరం టెట్ అర్హత సాధించినవారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్ సర్టిఫికెట్ గడువు ఏడేండ్లు. టీఎస్ టెట్ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. టెట్ నిబంధనలను సవరించినందున టెట్ నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య సంచాలకుడు, టెట్ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.