మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కాకా విగ్రహ ఆవిష్కరణ రాజకీయంగా కాక రేపుతోంది. జిల్లా కాంగ్రెస్లో మళ్లీ వర్గ విభేదాలు తలెత్తడంతో పరిస్థితులు ఉద్రికతంగా మారాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కొన్నేళ్లుగా కవర్తో కప్పి ఉంచిన కాకా గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు వ్యతిరేక వర్గానికి చెందిన మంతెన జగన్మోహన్రావు, మాజీ వైస్ చైర్మన్ ఉప్పలయ్యతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కవర్ తొలగించి ఆవిష్కరించారు.
అనంతరం విగ్రహానికి పాలాభిషేకంచేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వివేక్ వర్గంగా ఉన్న జగన్మోహన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ ఇంటి సమీపంలో భారీ ఎత్తున పోలీసుల మోహరించారు. మొన్న ఎంపీ వంశీ పర్యటన సందర్భంగా దండేపల్లి లో జరిగినట్లు ఇక్కడ సైతం గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసి పోలీసులను మోహరించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.