హైదరాబాద్ సిటీబ్యూరో/ మాదాపూర్, మే 27(నమస్తే తెలంగాణ): వానలు, ఈదురుగాలులతో జరిగిన ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం అందజేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట డివిజన్లో బాల్కానీ గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, సోమవారం బాధిత కుటుంబాలను కేటీఆర్ పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సహయం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్‌యాదవ్ పాల్గొన్నారు. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి చెందడం బాధాకరమని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భద్రత చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోరారు. నిర్వాసితులైన కుటుంబాలకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించి ఆదుకోవాలని విజ్జప్తి చేశారు.