హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి కోసం మరో కొత్త సంస్థ పురుడుపోసుకొన్నది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇప్పటికే ఆటా, నాటా సంఘాలున్న విషయం విదితమే. ఇటీవలే న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్‌లో జరిగిన ‘మాటా’ గ్రాండ్ లాంచ్‌లో దాదాపు 2,500 మంది భారతీయులు పాల్గొన్నారు.
సేవ, సంసృతి, సమానత్వం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, యువతను ప్రోత్సహిస్తూ, వయోధికుల ఉత్తమ సంరక్షణే లక్ష్యంగా మాటా పనిచేస్తుందని వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గనగోని తెలిపారు. న్యూజెర్సీ, న్యూయార్, మేరీల్యాండ్, వర్జీనియా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, అట్లాంటా, చికాగో, డెట్రాయిట్, కాన్సాస్ సిటీ, నార్త్ కరోలినా వంటి దాదాపు 20 నగరాల్లో మాటా తన చాప్టర్లను ప్రారంభించింది. 2వేల మంది జీవితకాల సభ్యులుగా నమోదైనట్టు మాటా ప్రతినిధులు ప్రదీప్ సామల, లక్ష్మీ మోపర్తిలు తెలిపారు.