హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అమెరికాలో మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన ఫణి తాళ్లూరు అనే తెలుగు వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలుగువాళ్లు అత్యధికంగా ఉండే వర్జీనియా యాష్‌బర్న్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమెరికాలో నివసిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్‌రెడ్డికి, వివాదాస్పద కంపెనీ ‘స్వచ్ఛ బయో’కు చెందిన హర్ష పసునూరికి ఫణి తాళ్లూరు సన్నిహితుడని ఎన్నారై వర్గాలు తెలిపాయి. ఇటీవల సీఎం అమెరికా పర్యటనలో తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు స్వచ్ఛ బయో కంపెనీ ఒప్పందం కుదుర్చుకోగా, అది ఫేక్ కంపెనీ అని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హర్ష పసునూరి, ఫణి తాళ్లూరు వర్జీనియా రాష్ట్రం యాష్‌బర్న్ ప్రాంతంలో ఎదురెదురు ఇండ్లలోనే ఉంటారని ఎన్ఆర్ఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలోనూ ఫణి తాళ్లూరు పాల్గొన్నారని, కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఫణి తాళ్లూరు కొన్నేళ్లుగా హర్ష పసునూరి, జగదీశ్‌రెడ్డి ఎనుములతో వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిసింది. అంతే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ‘బిగ్’ సంచలనం అంటూ వచ్చిన ఓ చానెల్ యజమానికి కూడా హర్ష పసునూరి, ఫణి తాళ్లూరుతో సన్నిహిత బంధం ఉన్నదని చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా వీళ్లే అన్నీ చూసుకుంటారని అమెరికా ఎన్నారై వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ వీరి ఇండ్లలోనే ఉండేవారని కూడా అంటున్నారు.
ఖరీదైన గిఫ్టులు ఇచ్చి…
అమెరికా మీడియా, స్థానిక తెలుగు కమ్యూనిటీ తెలిపిన వివరాల మేరకు.. ఫణి తాళ్లూరు తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మైనర్ ఇటీవల ఫిర్యాదు చేసింది. 2022లో తాను 11 ఏండ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఫణి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని, రెండేండ్లపాటు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేసిన పోలీసులు ఈ నెల 7వ తేదీన ఫణి తాళ్లూరును అరెస్ట్ చేశారు. ఆయనపై గతంలోనూ కేసులు ఉండటంతో ఈసారి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. నేరం నిరూపితమైతే ఆయనకు 60 ఏండ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
‘మేనేజ్’ చేసే ప్రయత్నం?
ఫణిని కాపాడేండుకు తెలుగు కమ్యూనిటీలోని కొందరు పెద్దమనుషులు తీవ్రంగా ప్రయత్నించారని, తమ రాజకీయ పలుకుబడిని కూడా ఉపయోగించారని సోషల్ మీడియాలో అక్కడి తెలుగు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ ఘటన గురించి తెలియకుండా కొందరు పెద్దలు ‘మేనేజ్’ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక న్యూస్ చానల్, ఒక వెబ్సైట్లో తప్ప మరెక్కడా ఈ వార్త కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు.