Vizag RK Beach | విశాఖపట్నంలో ఓ తెలంగాణ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఇది గమనించిన స్థానికులు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని తెలంగాణకు చెందిన లావణ్యప్రియగా పోలీసులు గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బీచ్ రోడ్డులో లావణ్య ప్రియ ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు అంటుకోవడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి పరిగెత్తింది. ఇది గమనించి స్థానికులు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో యువతి చేతులు, ముఖం, తలభాగం తీవ్రంగా కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు.
బాధిత యువతిని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.