జాతీయ పార్టీలకే జై కొట్టిన తెలంగాణ
తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 స్థానాలను కట్టబెట్టారు.
- చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ గెలుపు
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జాతీయ పార్టీలకు జై కొట్టిన ప్రజలు
- తెలంగాణ రాష్ట్రంపైనే ఫోకస్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 స్థానాలను కట్టబెట్టారు. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకున్నది. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికలను బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగానే భావించినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇలా ఏకపక్షంగా తీర్పు రావడం ఇదే తొలిసారి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రెండు దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఒక్క లోక్‌సభ స్థానం కూడా దక్కలేదు. నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కేవలం నాలుగు నెలలకే లోక్‌సభ ఎన్నికలు రావడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గతం కన్నా భిన్నంగా ఉన్నాయి.
మరోవైపు ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతాయని భావించిన బీజేపీ పూర్తిస్థాయిలో తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం డిసెంబర్ నుంచి మే 13వ తేదీ వరకు పూర్తిస్థాయిలో తెలంగాణ రాజకీయాలపైనే దృష్టిసారించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం హైదరాబాద్‌కే 2-3సార్లు వచ్చి ఇక్కడే ఉన్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వంటి పట్టణాలకు కూడా మోదీ ప్రత్యేకంగా రావడంతోపాటు రోడ్‌షోలు కూడా నిర్వహించారు. అమిత్‌షా, జేపీ నడ్డా వంటివారు ఎన్నిసార్లు వచ్చివెళ్లారన్నదానికి లెక్కేలేదు. వీరందరూ దృష్టిసారించడంతో ఈసారి బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించగలిగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సైతం
కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో రాష్ట్రంపై దృష్టి పెట్టింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే సహా ఆ పార్టీ హేమాహేమీలు ఇక్కడే తిష్టవేసి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించారు. డిసెంబర్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తన ఊపును కొనసాగించింది. తన పట్టును నిలుపుకోవడంతోపాటు జాతీయస్థాయిలో పార్టీకి ఉపయోగపడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్ నాయకులపైనే దృష్టిసారించాయి. రెండు పార్టీలకు కూడా సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కడియం కావ్య, దానం నాగేందర్, సునీతామహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి పోటీచేసిన నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్, ఆరూరి రమేశ్, గోడెం నగేశ్, బీబీపాటిల్ వంటివారు బీఆర్ఎస్ నుంచి చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి ఆయా పార్టీల్లోకి మారి టికెట్ సంపాదించి పోటీ చేశారు. వీరిలో కడియం కావ్య, గోడెం నగేశ్ ఎంపీలుగా విజయం సాధించారు.
పార్టీ మారినా వరించని విజయం
- కడియం కావ్య, గోడెం నగేశ్ గెలుపు
- మిగతా నేతలందరూ పరాజితులే
- చేదు అనుభవం మిగిల్చిన ఫలితాలు
పార్టీలు మారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన వారిలో కడియం కావ్య, గోడెం నగేశ్ మినహా మిగిలినవారంతా ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీచేసిన గోడెం నగేశ్ విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు.
బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ వరంగల్ నుంచి బరిలోకి దిగి ఓడిపోగా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. క్రితంసారి చేవెళ్ల స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికైన రంజిత్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నాగర్‌కర్నూల్ నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
ఈసారి తన కుమారుడు భరత్‌ను అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరి నాగర్‌కర్నూల్ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఓటమిపాలయ్యారు. రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సునీతా మహేందర్‌రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ తరపున మహబూబాబాద్ స్థానం నుంచి పోటీచేసిన సీతారాంనాయక్ ఓడిపోయారు. బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మెదక్ స్థానం నుంచి పోటీచేసిన నీలం మధు కూడా పరాజయం పాలయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

