వరంగల్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పిల్లలు, మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌సత్యార్థి ప్రశంసించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కొనియాడారు. ప్రజలు వీటిలో భాగస్వాములు అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. పిల్లలపై అఘాయిత్యాల కేసుల పరిష్కార ప్రక్రియ వేగంగా జరుగాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు అన్ని వసతులు ఉన్న కోర్టులు అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటుచేసిన పోక్సో కోర్టును మాడల్‌గా తీసుకొని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని సూచించారు. ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన కైలాశ్‌సత్యార్థి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పిల్లలపై అఘాయిత్యాలు ఇంకెన్నాళ్లు?
పిల్లలపై అఘాయిత్యాలకు ముగింపు పలికేందుకు అందరం కృషి చేయాలి. దోషులకు కఠినమైన శిక్షలు పడాలి. వేగంగా కేసుల విచారణ పూర్తి కావాలి. పిల్లలపై లైంగిక నేరాలను అడ్డుకొనేందుకు పదేండ్ల క్రితమే కేంద్రం పోక్సో చట్టం తెచ్చినప్పటికీ, అఘాయిత్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్రత్యేకంగా పోక్సో కోర్టులను నిర్మించాలి. వరంగల్ కోర్టును మాడల్‌గా తీసుకొని అన్ని చోట్ల ఏర్పాటుచేయాలి. దేశవ్యాప్తంగా 2 లక్షల పోక్సో కేసులు(92.6%) పెండింగ్‌లో ఉన్నాయి. 2.5% కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడింది. పిల్లలపై వేధింపుల కేసుల పరిష్కారంలో వరంగల్ కోర్టు మెరుగ్గా ఉన్నది. ఇక్కడ 256 కేసులు నమోదైతే 146 పరిష్కరించారు. 14 కేసుల్లో దోషులకు శిక్ష పడింది. వరంగల్ కోర్టులో 40% కేసులే పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ విచారణ అయిన 6% కేసుల్లో దోషులకు శిక్షపడింది.
18 ఏండ్ల వరకు నిర్బంధ విద్య
ఇప్పటికీ బాల్య వివాహాలు పెరుగుతుండటం ఆందోళనకరం. ప్రతి నలుగురు బాలల్లో ఒకరికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా సామాజికంగా మార్పు రావాలి. 50 ఏండ్లవాడు 14 ఏండ్ల అమ్మాయిని పెండ్లి చేసుకున్న ఘటనలు చాలా బాధాకరం. బాల్య వివాహాల నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో మహిళా కమిటీలు ఏర్పడాలి. ఆడపిల్లల చదువుతోనే సమాజంలో దురాచారాలు తొలగిపోతాయి. ఆడపిల్లలకు 18 ఏండ్ల వరకు నిర్బంధ విద్య అమలు చేయాలి. ఉచిత విద్య, వైద్యం అందించాలి. లైంగిక విద్య చాలా ముఖ్యమైనది. పిల్లల భవిష్యత్తులో టీచర్ల పాత్ర చాలా కీలకం.
పిల్లలు చెప్పేది తల్లిదండ్రులు వినాలి
సమాజంలో పరిస్థితులు మారాయి. జీవనశైలి మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయడం అనివార్యమైంది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు పక్కకుపోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. వారు చెప్పేవన్నీ వినాలి. అప్పుడే వారు తమ సంతోషాన్ని, సమస్యలను చెప్పుకొంటారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిలో ఎక్కువసార్లు దగ్గరి వారే ఉంటున్నారు. ఇలాంటివి తల్లిదండ్రులతో తప్ప వేరే వారితో చెప్పుకోలేరు. పిల్లలకు అన్నీ ఇస్తున్నామని చాలామంది అనుకుంటారు. ముంబైలో ఐఏఎస్ తల్లిదండ్రులు తమ అమ్మాయికి అన్ని వసతులు కల్పించారు. కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. తండ్రి స్నేహితుడే బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.
పిల్లల బాధ్యత అందరిది
అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నా.. ఆలోచనలు మాత్రం చాలా వెనుకబడి ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు ఆరుగురు పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీరిలో ఇద్దరు తీవ్రమైన లైంగికదాడులకు గురవుతున్నారు. ప్రతి గంటకు ఎనిమిది మంది అపహరణకు గురవుతున్నారు. వీరంతా మానవ అక్రమ రవాణా వ్యవస్థకు బలవుతున్నారు. పిల్లలపై ముఖ్యం గా ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వీటికి ముగింపు పలికే బాధ్యత అందరిపైనా ఉన్నది.