హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దసరాకు 7వేల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. అన్ని ప్రత్యేక బస్సుల్లోనూ 50% అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించింది. ఒక్క కరీంనగర్ జోన్ నుంచే మొత్తం 3,533 బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది. రీజియన్లవారీగా చూస్తే.. ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులు ఉన్నాయి.
హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు నడుపుతుండగా.. మహబూబ్నగర్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్లగొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా నడుపాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రధానంగా ఈ నెల 9,10,16,17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండే అవకాశం ఉన్నదని.. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి తగిన ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5(50%) వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9,10,16,17 తేదీలతోపాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎకువగా ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మీ పథకంలో భాగంగా దసరాకు నడిపే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి స్పష్టంచేశారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ల్లో సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.