హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/కామారెడ్డి : రాష్ర్టానికి చెందిన ప్రభుత్వ టీచర్ బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2026 గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు కేంద్ర విద్యాశాఖ భవానిని ఎంపికచేసింది. ఈ ఏడాది జాతీయంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ అవార్డులు వరించాయి.
తెలంగాణ నుంచి భవాని ఒక్కరే ఎంపికయ్యారు. భవాని 2025లో రాష్ట్రస్థాయి అవార్డును అందుకోగా, ఈ సారి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(బాలికలు)లో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. యూట్యూబ్ పంతులమ్మగా పేరు గడించారు. గణితం పాఠాలను సులభంగా, వినూత్నంగా బోధించడంలో దిట్ట. బాలికల విద్య కు ప్రోత్సాహంనందించడంలో, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలోనూ భవాని ముందున్నారు.