హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
మంత్రి కేటీఆర్ అభినందనలు
ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. సత్వరమే ఆక్సిజన్‌ను రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. మూడు రోజుల సమయంతో పాటు, ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నా యి. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే. వైజాగ్‌నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటుంది రాష్ట్రం.
My compliments to both Health Minister @Eatala_Rajender Garu & @TelanganaCS Somesh Kumar Garu who are supervising Oxygen tankers airlifting from Hyderabad to Orissa to bring back oxygen faster to Telangana – saving 3 days & many valuable lives. First time in India#NeedOfTheHour pic.twitter.com/gAIjpeAOas
— KTR (@KTRTRS) April 23, 2021