హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ) : వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే నడిచింది. రాష్ట్రంలో వరి, పత్తి సాగును నిలువరించాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ రైతు కమిషన్ సూచించింది. ఈ రెండు పంటలను సాగు చేయడం వల్ల ఆర్థికంగా, పర్యావరణపరంగా మంచిది కాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలో పంటల మార్పిడిపై కమిషన్ రూపొందించిన నివేదికను చైర్మన్ కోదండరెడ్డి శనివారం విడుదల చేశారు.
ఈ నివేదికలో వరి, పత్తి సాగు, పంటల మార్పిడిపై పలు కీలక విషయాలను పొందుపరిచింది. ముఖ్యంగా రాష్ట్రంలో వరి, పత్తి సాగు భారీగా పెరిగిపోతున్నదని, అదే సమయంలో ఉద్యాన పంటల సాగు తగ్గిపోతున్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో వరి, పత్తి సాగును తగ్గించాలని సూచించింది. వరి, పత్తి సాగు ఎక్కువ కాకుండా ఉండేందుకు ఈ రెండు పంటలకు పంటల బీమా పథకాన్ని అమలు చేయొద్దంటూ వివాదాస్పద సూచన చేసింది.దీంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయరంగం గాడి తప్పిందని పేర్కొన్నది.