Congress | కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు లొల్లి.. అధిష్ఠానానికి తలనొప్పిగా రేవంత్‌రెడ్డి తీరు
కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపుల చిచ్చు రగులుకున్నది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారాయి.
- పాంచ్‌న్యాయ్ సూత్రాలకు విరుద్ధమంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు
- ఢిల్లీని తాకిన తెలంగాణ పంచాయితీ
- హిమాచల్‌ప్రదేశ్‌లో లో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి
Congress | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపుల చిచ్చు రగులుకున్నది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు కాంగ్రెస్ ప్రకటించిన పాంచ్‌న్యాయ్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండటంతో ఆ పార్టీ చిత్తశుద్ధిపైనే అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ సిద్ధ్దాంతానికి, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినదానికి వ్యతిరేకంగా ఉండటంతో ఇంటా బయటా ఇరకాటాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్‌రెడ్డి చర్యలు పాంచ్‌న్యాయ్ సిద్ధ్దాంతానికి, పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి వ్యక్తంచేసిన ధర్మాగ్రహంలో న్యాయం ఉన్నదని పార్టీ పెద్దలు ఏకీభవిస్తున్నారు.
జీవన్‌రెడ్డితో స్వయంగా మాట్లాడటానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఢిల్లీకి ఆహ్వానించడం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. రేవంత్‌రెడ్డి తన సొంత ఎజెండాతో స్వీయ ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెడితే, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ అధిష్ఠానం ఆందోళన చెందుతున్నది.
ఫిరాయింపులపై ఎందుకీ లొల్లి?
తెలంగాణలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, అవసరం లేకున్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం, పార్టీ కోసం మొదటినుంచీ కష్టపడిన వారిని పక్కనపెట్టడం, సీనియర్లను సైడ్లైన్చేయడం, పాంచ్న్యాయ్కు వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరడాన్ని గతంలో తీవ్రంగా ఎండగట్టిన పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు స్వయంగా ఇందుకు ఒడిగట్టడం వంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రగిలించాయి. దీంతో పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా చేరిన వారికి మధ్య అగాథం ఏర్పడుతున్నది.
పార్టీలో మునుపెన్నడూ లేనివిధంగా సీనియర్లు, జూనియర్లు, పాతవారు, కొత్తవారు అనే వివాదం ముదురుతున్నది. పార్టీలో మొదటినుంచీ ఉంటూ, పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం కష్టనష్టాలను ఓర్చుకుంటూ పనిచేసిన నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం అతి చేరువకు వచ్చి అందకుండా పోవడం నుంచి ఇంకా తేరుకోకముందే, తెలంగాణలో రేగిన ఫిరాయింపుల చిచ్చు తలనొప్పిగా మారడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు ఢిల్లీలో మకాం వేసిన ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ఈ పరిస్థితి ఎందుకు లేదు?
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. తెలంగాణలో మాదిరిగా కాకుండా కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉంటున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హెచ్చరించిన కారణంగానే తమ సంఖ్యాబలం పెంచుకుంటున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాదం కర్ణాటకలో సైతం ఉన్నది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నేతలు మొదటినుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు. పైగా అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర కూడా బీజేపీకి ఉన్నది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి చరిత్ర లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతారేమోనన్న సాకుతో ఫిరాయింపులను సీఎం రేవంత్‌రెడ్డి సమర్ధించుకోవడం హాస్యాస్పదం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అమలుచేస్తున్నది. ఒకవైపు తమ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే మరోవైపు తెలంగాణలో వాటిని ప్రోత్సహిస్తున్నది. తాము ఫిరాయింపులకు వ్యతిరేకమని పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని పాంచ్న్యాయ్లో స్పష్టం చేసింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌గాంధీ పదే పదే వ్యాఖ్యానించారు. కానీ, తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ చెప్తున్న, ఆచరిస్తున్నదానికి పొంతనలేదని నిరూపిస్తున్నది.
హిమాచల్‌ప్రదేశ్‌లో అనర్హత.. ఇక్కడ వర్తించదా?
హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయగానే స్పీకర్ ఆ ఆరుగురిపై అనర్హత వేటు వేశారు. దీనిని సవాల్ చేస్తూ విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
హర్యానాలోనూ అదే తంతు
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి హర్యానా ఉదంతం మరో ఉదాహరణ. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్‌చౌదరి ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలు పెడబొబ్బలు పెడుతున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ సెక్షన్ 2(1)(ఏ) ప్రకారం సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని స్పీకర్‌ను కోరుతున్నారు. మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం, సిద్ధాంతం అంటూ ఉండదా? ఒక్కో రాష్ర్టానికి ఒక్కో రకమైన వైఖరి ఉంటుందా? దీనికి ఆ పార్టీ ఏం సమాధానం చెప్తుందని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

