హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్’ కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్‌రెడ్డి రైజింగ్‌లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప్ప, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌లా పంటలు పండించే ఆలోచన రేవంత్ చేయరంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘హిల్ట్-పీ ఎవరి కోసం? ఎందుకోసం?’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోకుండా, పరిశ్రమలశాఖ మంత్రికే తెలియకుండా, ఒక ఐఏఎస్ అధికారితో జీవో విడుదల చేయించిన రేవంత్‌రెడ్డి తీరు చాలా దుర్మార్గమని నిప్పులు చెరిగారు. పరిశ్రమల భూములను పరిశ్రమలకే కాకుండా, మల్టిపర్సస్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై, రూ.5లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని తూర్పారపట్టారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. వేలం పాట ద్వారా వెళ్తే రూ.10లక్షల కోట్ల వరకు ఈ కుంభకోణం జరిగి ఉండేదని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ఆ జీవోలో కొన్ని సవరణలు చేస్తున్నామని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న హిల్ట్ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పరిశ్రమలకు కేటాయించిన భూములు ఇప్పుడు హిల్ట్ పాలసీ పేరుతో జరిగే మార్పిడి రిజిస్ట్రేషన్ ఫీజులో కేవలం 30శాతం చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖరారు చేస్తుంది? దీని వెనకాల ఉన్న మతలబు ఏమిటి? అగ్గువకే బడా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టాలన్న నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దాదాపు 500మంది బడా పారిశ్రామికవేత్తలకు, 40మంది సర్కారీ పెద్దలు కలిసి, దొడ్డిదారిలో కోట్లాది రూపాయలు దండుకోవాలని పథకం వేశారని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తరహాలో రాష్ర్టాన్ని బాగుచేయాలన్న ఆలోచన రేవంత్‌రెడ్డికి లేదని, అందుకే ఆయన హైడ్రాతో మొదలుపెట్టి, హిల్ట్ పీ వరకు అన్నీ కూడా భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.
కాలుష్యం సాకుతో పరిశ్రమలను శివారుకు తరలించి, భూ మార్పిడి చేసి ప్రైవేట్‌కు కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల సంక్షేమం పట్టదా? అని జగదీశ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ముఖ్యమంత్రి ఏనాడూ కార్మికుల సమస్యలపై దృష్టిపెట్టలేదని మండిపడ్డారు. నిజంగా కాలుష్యమే కారణమైతే, పరిశ్రమలు తరలించే క్రమంలో ఆ శాఖ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. హిల్ట్ పీ జీవోకు ముందుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఎందుకు సంప్రదించలేదని, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎందుకు సేకరించలేదని నిలదీశారు.
పరిశ్రమల శాఖ మంత్రికే తెలియకుండా, దొడ్డిదారిలో హిల్ట్ పీ జీవో తీసుకురావడాన్ని జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. దొంగతనం చేసినందుకు కాకుండా, దాన్ని బయటపెట్టిన వారిని విచారించేందుకు కమిటీ వేయడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. పర్యావరణహిత పరిశ్రమలు తెస్తామంటే ఎవరూ అడ్డుకోరని, కానీ ఇలా ఇండస్ట్రీ పాలసీ రూపొందిస్తే ప్రజలెవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
నగరంలో ఇప్పటికే శ్మశానాలు, కొత్తగా దవాఖానలు నిర్మించేందుకు స్థలాలు దొరకడం అతిపెద్ద సమస్యగా మారిందని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు అత్యధిక శాతం ప్రజల నుంచి శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించాలనే డిమాండ్లే వినిపించాయని గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా భూదందాలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా, ఎంతసేపూ కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని సీఎం రేవంత్‌పై ఆయన నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే ఈ విధానం గురించి కొన్ని ప్రతిపాదనలు వచ్చినా, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిపడకూడదని కేసీఆర్ ఆనాడే వ్యతిరేకించారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. కానీ ఇలాంటి భూదందా కేసీఆర్ హయాంలో జరుగలేదని స్పష్టంచేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వెంటనే హరితహారం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటించారని గుర్తుచేశారు. ఉద్యమం తరహాలో చిన్నపిల్లల నుంచి పండుముసలివాళ్ల వరుకు అందరినీ ఈ యజ్ఞంలో భాగస్వాములను చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు ఎర్రోజు రమణకుమార్, యుగంధర్, ప్రభాకర్, పలువురు సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
1) హిల్ట్ పాలసీ కోసం తీసుకొచ్చిన జీవో వెంటనే రద్దు చేయాలి.
2) అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టేక్హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలపై చర్చించాలి
3) పాలసీపై నిపుణులు, ఇండస్ట్రియల్ వారితో కమిటీ వేసి, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్కారు పరిశ్రమల భూముల మార్పిడి విధానంపై నిర్ణయం తీసుకోవాలి.
ప్రజామోదం లేకుండా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ జీవోను వ్యతిరేకిస్తున్నాం. పరిశ్రమల తరలింపు గురించి మాట్లాడుతున్నారే తప్ప, అందులో పనిచేసే కార్మికుల కష్టాలు పట్టవా?. ఇక్కడ అతి తక్కువ ధరకే పరిశ్రమల భూములు కట్టబెడుతున్నారు.- జాన్‌వెస్లీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
భూముల అమ్మకం అనేది ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అంతేకానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టడం కాదు. దీనిని మేం వ్యతిరేకిస్తున్నం. పరిశ్రమల భూములను తెగనమ్మి.. అదానీ, అంబానీల వంటి వారికి నామమాత్ర ధరలకే కట్టబెట్టడం దారుణం.
– కే గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) నేత
ఆంధ్రాపాలనలో తెలంగాణ విధ్వంసమైంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కు తెలంగాణ పుట్టినిల్లు. చీరలకే సంతృప్తిపడే వారు మహిళలు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు.. మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారు ?. మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా.. వారితో కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు తీసుకోవాలి.
– గోగు శ్యామల, రచయిత
హిల్ట్ పాలసీని తీసుకురావడానికి కాలుష్యం, ఆదాయమే కారణమని చెబుతున్న సీఎం.. ఆదాయం కోసం ఎలాంటి భూములనూ అమ్మొద్దు. కాలుష్య నియంత్రణపై ఈ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ హయాంలో కాలుష్య నియంత్రణ, పొల్యూషన్ బోర్డు పర్యవేక్షణకు అనుగుణంగా ఉండేలా పరిశ్రమల కోసం 20వేల ఎకరాల సేకరించింది. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఉపయోగించుకునే వారు. అన్ని భూములు అమ్మితే రూ.5లక్షల కోట్లు వస్తుందంటున్నారు కానీ సర్కారు మాత్రం రూ.5000 కోట్ల ఆదాయమే వస్తుందని చెబుతున్నది. ఎంతో విలువైన భూములను తక్కువ ధరకే అమ్మడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటీ?. పరిశ్రమలవాడల్లో ఉన్న భూములు సేకరించి, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం కోసమే విక్రయిస్తున్నారన్న విషయం ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది.
– పాపారావు, విశ్లేషకుడు
భూములు విక్రయించడం కాదు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ర్టానికి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. నిపుణులు, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా, కనీసం మంత్రులకు కూడా తెలియకుండా తెచ్చిన జీవోను ప్రజలు ఒప్పుకోరు. ఇందులో సీమాంధ్రుల కుట్రలు దాగి ఉన్నాయి.
– ఓఎన్ రెడ్డి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ కన్వీనర్
పారిశ్రామికవాడల భూములను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకొనే ముందు బాధితులు, లబ్ధిదారులతో చర్చించాలి. ఇలాంటి నిర్ణయాలు ప్రజాప్రయోజనాల కోసం తీసుకోవాలి.
– అయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్