హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ నష్టనివారణ చర్యలు ప్రారంభిస్తున్నది. కొత్తగా ఆదాయమార్గాలు అన్వేషించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో బస్సుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైంది. రీజనబుల్ ధరల్లో యాడ్స్‌ను ఆన్లైన్లోనే బుక్ చేసుకునేలా ప్రత్యేకంగా ప్రాజెక్టును రూపొందించింది. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చినట్టు తెలిసింది. సంస్థ ఆదాయం పెంచడంలో అనేక మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో ప్రకటనల ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గతంలో యాడ్స్‌తో ఏటా కేవలం రూ.20 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వచ్చేదని, దానిని రూ.50 కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
వచ్చే ఆదాయాన్ని పాత బకాయిల చెల్లింపునకు, కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్టు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. తొలుత ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో ఈ యాడ్స్‌ను ప్రవేశపెడతామని, ఆ తర్వాత విజయవంతమైతే డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని వంటి బస్సుల్లోనూ ప్రకటనలు ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. ప్రధానంగా బస్సు వెనుక, కుడి, ఎడమ వైపులతోపాటు సీట్లు, టికెట్ వెనుక ప్రకటనలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. బస్సులు తిరిగే ఏరియాలను బట్టి ధరలను త్వరలోనే నిర్ణయిస్తామంటున్నారు.
వ్యాపార కేంద్రాలుగా బస్టాండ్లు!
బస్టాండ్లను వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. లీజు తీసుకున్న వ్యక్తులు సంబంధిత బస్టాండ్‌లో లీగల్‌గా ఏ వ్యాపారమైనా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా బస్టాండ్లలో ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, స్వీట్‌షాప్‌లు.. ఇలా ఏ తరహా వ్యాపారమైనా నిబంధనలకు లోబడి చేసుకోవచ్చు. బస్సుల కోసం వేచి ఉండే సమయంలో షాపింగ్ చేసుకునేలా.. ప్రయాణికులకు కావాల్సిన వస్తువులను బస్టాండ్లలో అందుబాటులో ఉంచేందుకు ఆవరణల రూపురేఖలు మార్చనున్నది.