TGMC | హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మూడు పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టును శాశ్వత ప్రాతిపదికన, రెండు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్టు పేర్కొన్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.వెయ్యి ఫీజు చెల్లించి టీజీఎంసీ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించింది. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పేర్కొన్న అర్హతలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్ట్‌ను ఓపెన్ క్యాటగిరీ మహిళలకు కేటాయించారు. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు.. తాజాగా నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలని సూచించింది. గ్రూప్-4లో వచ్చిన మార్కులను 80శాతంగా పరిగణిస్తామని, టీజీఎంసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి 20శాతం వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నది.
అయితే 2022లో వచ్చిన గ్రూప్-4 నోటిఫికేషన్‌ను అర్హతగా తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోనివారు అర్హులు కాదా? అని, ఆ నోటిఫికేషన్ తర్వాత పాసైన వారు ఎందుకు అర్హులు కాదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీజీఎంసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి 20 శాతం వెయిటేజీ ఇస్తామని చెబుతుండగా, ఎంత సర్వీస్‌కు ఎన్ని మార్కులు కలుపుతామన్న విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏకమొత్తంగా 20 మార్కులు కలిపితే సీనియర్లు, జూనియర్లకు తేడా ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-4ను కనీస అర్హతగా పేర్కొనే ముందు టీజీపీఎస్సీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిసింది. టీజీఎంసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని టీజీపీఎస్సీ సైతం చెబుతున్నది. ఉద్యోగం ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ధారించుకొని తూతూమంత్రంగా నోటిఫికేషన్ వేశారని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతున్నది.