మురిగిపోయిన 1129 కోట్లు.. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత
రాష్ట్ర ప్రభుత్వ సోమరితనంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,129 కోట్ల నిధులు మురిగిపోయాయి. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు గడువు ముగియడంతో లాప్స్ అయ్యాయి.
- స్థానిక సంస్థలకు భారీ ఎదురుదెబ్బ
- గడువు తీరినా ఖర్చుల లెకలు చెప్పలేదా?
- యూసీలు, ఎన్నికల జాప్యాన్ని ఎత్తి చూపిన కేంద్ర ప్రభుత్వం
- 16వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పైనా తీవ్ర ప్రభావం
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ సోమరితనంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,129 కోట్ల నిధులు మురిగిపోయాయి. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు గడువు ముగియడంతో లాప్స్ అయ్యాయి. నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) సకాలంలో సమర్పించకపోవడం, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం, ఇతర సాంకేతిక కారణాలతో పెండింగ్ నిధులను ఇక విడుదల చేయలేమని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.729.41 కోట్లు, మండల, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన మరో రూ.400 కోట్లు నిలిచిపోయాయి. ఒకవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత వేధిస్తుంటే.. మరోవైపు వచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడం పాలనాపరమైన వైఫల్యాన్ని, అధికార యంత్రాంగం సోమరితనాన్ని ఎత్తిచూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులను రాబట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
గడువు ముగిసింది.. బకాయిలకు బ్రేక్ !
గత ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభమైంది. దీంతో పాత ఆర్థిక సంఘం పరిధిలోని పెండింగ్ నిధులను విడుదల చేయడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పినట్టు సమాచారం. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు మొత్తం రూ.3,023.15 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.2,293.75 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.729.41 కోట్ల నిధులు నిలిచిపోవడానికి వినియోగ ధ్రువీకరణ పత్రాల సమర్పణలో లోపాలే ప్రధాన కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన రూ.400 కోట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2024- 25, 2025- 26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధుల విడుదలకు స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ కీలక అర్హతగా ఉన్నది. అయితే గడువులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఓటమి భయంతో కాంగ్రెస్ సర్కార్ పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త నిధులపైనా నీలినీడలు
2026- 31 మధ్య ఐదేండ్ల కాలానికి 16వ ఆర్థిక సంఘం తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.9,968 కోట్లు కేటాయించింది. పట్టణ స్థానిక సంస్థలకు మరో రూ.11,548 కోట్లు కేటాయించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల్లో గ్రామ పంచాయతీలకు 80 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం వాటా నిర్ణయించారు. ఈ నిధులను రూ.7,974 కోట్ల బేసిక్ గ్రాంట్లు, రూ.1,994 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా విభజించారు. అయితే గత ఆర్థిక సంఘం నిధుల వినియోగ లెకలు, యూసీల సమర్పణ, స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలు కొత్త నిధుల విడుదలకు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. పాత బకాయిలను కోల్పోవడమే కాకుండా కొత్త నిధుల విడుదలలోనూ జాప్యం జరిగితే గ్రామీణ అభివృద్ధి, పల్లెల ప్రగతి మరింత కుంటుపడే ప్రమాదం పొంచి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

