ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం.. కేఆర్ఎంబీకి ఈఎన్సీ లేఖ
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ గవర్నమెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు కొనసాగించకుండా ఏపీని నిలువరించాలని కోరారు. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని కేఆర్ఎంబీకి లేఖలో గుర్తు చేశారు.
కేఆర్ఎంబీ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ఏపీ ప్రభుత్వం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్‌కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళీ బండ డైవర్షన్ స్కీం) నుంచి అక్రమంగా కాల్వను ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపు పనులను వేగంగా పూర్తి చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది నుంచి ఏపీకి 4 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అస్తవ్యస్తంగా చేపట్టిందని ఈ తీర్పును నిలిపివేయాలని తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు గతంలోనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అదీగాక ఆర్డీఎస్ కుడివైపు కెనాల్ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో కొంతకాలం పనులు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నది.
రూ.1,985.423 కోట్లతో పనులు
ఏపీ ప్రభుత్వం రూ.1,985.423 కోట్ల వ్యయంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట కుడి కాల్వ పనులకు గత ఏడాది శ్రీకారం చుట్టింది. 4 టీఎంసీల నీటిని తరలించేందుకు కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు 4 లిఫ్టులను ఏర్పాటు చేసి మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్రమంగా నీటిని తరలించే కుట్రలు చేస్తున్నది. కర్నూల్ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీటిని పుష్కలంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ కుడివైపు కాల్వ పనులు చేపట్టింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని తుంగభద్ర నది నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతోపాటు నదినీటి హక్కులు కలిగిన రాష్ర్టాల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కుడివైపు కాల్వ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టగా పనులు తుది దశకు చేరుకొన్నాయి.
అలంపూర్ ఆయకట్టుకు నీటి కటకట..
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడివైపు చేపట్టిన కాల్వ నిర్మాణంతో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజక వర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి కటకట ఏర్పడనున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం సునాయసంగా నీటిని తరలించేందుకు అవకాశం మెండుగా ఉండటంతో ఎడమ కాల్వ (తెలంగాణ ఆయకట్టు)కు నీటి రాక తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఏనాడు 35 వేల ఎకరాలకు సాగునీరు అందిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కుడివైపు కాల్వ నిర్మాణంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో వంద గ్రామాలు తాగునీటికి, ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదితీర ప్రాంత ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉన్నదని రైతులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

