Telangana | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఒక్క డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు.
సమగ్ర కుల గణన సర్వేకు సంబంధించిన విధివిధానాలను క్యాబినెట్ ఆమోదించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నవంబర్ 30లోపు సర్వే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోమవారం కలెక్టర్లతో సదస్సు నిర్వహిస్తామని, జిల్లా, మండల అధికారులకు శిక్షణ ఇస్తామని వివరించారు. నవంబర్ 4 లేదా 5 నుంచి సర్వే ప్రారంభమవుతుందన్నారు. సమాచార సేకరణకు సంబంధించి ప్రతి 150 ఇండ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం 20 రోజుల్లోపు ప్రక్రియ పూర్తిచేస్తామని, ఈ వివరాలతో నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ ఇస్తున్నామని, ఖజానాపై నెలకు రూ.230 కోట్ల భారం పడుతుందని తెలిపారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు న్యాయ సమ్మతంగా రావాల్సిన డీఏల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించడం సరికాదన్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు రావాల్సి ఉంటే, ఒక్కటే మంజూరు చేయడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి, ఇప్పుడు తప్పడం సమంజసం కాదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఫసియుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదనాయక్ విమర్శించారు. ఐదు డీఏలు కలిపి 17.28 శాతం రావాల్సి ఉన్నదన్నారు. ఇందులో ఒక డీఏ మాత్రమే ప్రకటించడం అన్యాయమన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ కూడా ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో పేరొన్న విధంగా జీవో 317ను రద్దు చేయాలని, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.