హైదరాబాద్ : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని వైట్‌ఫీల్డ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ సౌత్ ఇండియా స్టేట్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని వెల్లడించారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత, పదవులతో పాటు ప్రత్యే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్యవైశ్యులకు ప్రత్యేక గౌరవమిస్తూ వారికి అన్ని విధాల అండగా ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా, కోశాధికారి దినేశ్, దక్షిణ భారతదేశం రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.