హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణలో అధికారులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎప్‌సెట్‌కు ఏపీలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీజీ ఎప్‌సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో నిర్వహించగా, ఏపీలోని విజయవాడ, కర్నూలులో ఎప్‌సెట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానికేతర కోటాలో మళ్లీ ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారా.. ? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం స్థానికేతర కోటాలో భాగంగా ఎప్‌సెట్‌లో 15శాతం సీట్లను ఇది వరకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఇచ్చారు. పదేండ్లపాటు అమలుకాగా, నిరుటితో గడువు ముగిసింది. ఈ అంశంపై తేల్చేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత వరకు భేటీ అయ్యింది లేదు. కాగా, ఏపీలో సెంటర్లు ఏర్పాటుచేయాలన్న నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో 2025-26 టీజీ ఎప్‌సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ 20న విడుదలకానుంది. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.