హైదరాబాద్/ చిక్కడపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సర్కారుకు అల్టిమేటం జారీచేసింది. ఏడాదిలోపు సీపీఎస్‌ను రద్దుచేయాలని గడువు విధించింది. లేదంటే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో పాత పింఛన్ సాధన పోరాట సభ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంవత్సరంలోపు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పింఛన్ పునరుద్ధరించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. లేని పక్షంలో సీపీఎస్ రద్దు, పాత పింఛన్ సాధనకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతోపాటు భారీగా తరలివచ్చిన ఉద్యోగులతో ప్రాంగణం దద్దరిల్లింది.
ఉద్యోగుల జేఏసీ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిదని, మంగళవారం నాటి చర్చలు విఫలమైతే తాము ప్రకటించిన కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. 8నుంచి 19 వరకు ఉమ్మడి జిల్లాల్లో చేపట్టిన బస్సు యాత్ర, అక్టోబర్ 12న లక్ష మందితో చలో హైదరాబాద్‌ను కొనసాగిస్తామని వెల్లడించారు. సీపీఎస్‌తో ఉద్యోగుల కుటుంబాలకు భద్రతలేదని వాపోయారు. ఉద్యోగుల సొమ్ము రూ. 450కోట్లను షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా, ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉత్తరానికో రూల్.. దక్షిణానికో రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆరోపించా రు. ఎస్టీయూ టీఎస్ అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ.. సీపీఎస్ అంతం.. జేఏసీ పతంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘాల నేతలు పుల్గం దా మోదర్‌రెడ్డి, సత్యనారాయణ, బీ శ్యామ్, రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చావ రవి, కటకం రమేశ్, మణిపాల్‌రెడ్డి, లక్ష్మయ్య, ఉమాదేవి, గోల్కొండ సతీశ్ పాల్గొన్నారు.