న్యూయార్క్, మే 28 : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నది. చంద్రుడిపై మానవుల శాశ్వత నివాసం కోసం ఓ నగరాన్నే నిర్మించబోతున్నది. 20 బిలియన్ డాలర్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు 2032 వరకు పూర్తవుతుందని నాసా ప్రకటించింది. దీంతో భూమి బయట మానవులు బతికే మొదటి నివాసం ఇదే కాబోతున్నది. ఈ ఏడాది చివరికల్లా దీన్ని ప్రారంభిస్తారు. మొదట్లో చిన్న క్యాంపులాగా ప్రారంభించి తర్వాత దాన్ని విస్తరించబోతున్నారు.
ఈ నగరాన్ని భూమి మీద నుంచి తీసుకెళ్లే మడతపెట్టగల వసువులతో తయారు చేస్తారు. చంద్రుడి దక్షిణ ధృవంకు దగ్గర్లోనే ఈ నగరాన్ని నిర్మించబోతున్నారు. ఎందుకంటే అక్కడ నీటి నిక్షేపాలు ఉన్నాయి. ఈ నగరం భూమిమీద ఉన్న ఇండ్ల మాదిరిగా ఉండబోతున్నది. అలాగే కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా దీన్ని డిజైన్ చేస్తారు. నాసా అడ్మినిస్ట్రేటర్ జేరెడ్ ఇసాక్మాన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో చంద్రుడిపైకి సైంటిఫిక్ వస్తువులను పంపుతామన్నారు. వాటి ద్వారా ఎక్కడ నగరం నిర్మాణానికి అనువుగా ఉంటుందో సెర్చ్ చేసి.. వచ్చే సంవత్సరం నుంచి నిర్మాణ పనులు మొదలు పెడుతామన్నారు. దీంతో నాసా చేపట్టే ఈ నగరం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.