చిట్యాల, మే 28: “పద్మ, ఆరాధ్య, హర్ష, అమ్మ అందరూ నన్ను క్షమించండి.. ఇది చా లా చిన్నమాటే అయిన నా ఈ జన్మకు అతి పెద్ద తప్పు.” సీఎం రేవంత్ అన్న.. అగ్రికల్చర్ డిపార్టుమెంట్లో ఏఈవోగా ఉద్యోగంలో చేరి తక్కువ జీతాలతో ఏఈవోగానే రిటైర్ అవు తున్నాము. దయచేసి ఏఈవోల దుస్థితి అర్థం చేసుకొని భవిష్యత్తుపై మాకు భరోసా కల్పిస్తావని వేడుకుంటూ సెలవు అన్న.. అని ఓ ఏఈవో 9 పేజీల సూసైడ్ నోట్లో చివరిసారిగా రాసిన వ్యాఖ్యలివి..
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కేతేపల్లి మండలంలో ఏఈవోగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఓ మిత్రుడిపై నమ్మకంతో అతనితో కలిసి వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాడు. దీంతో కొద్దిగా అప్పులు కావడంతో దానిని తీర్చటానికి మరికొన్ని అప్పులు చేశాడు.
అవి తీర్చటానికి అధిక వడ్డీలకు అప్పుల మీద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారిలో మిత్రులు, తోటి ఉద్యోగులు, చిట్‌ఫండ్ ఏజెంట్లు ఉన్నారు. ఈ క్రమంలో అప్పులు తీర్చాలని బాలరాజు, అతని భార్యపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈనెల 27న 9పేజీల సూసైడ్ నోటు రాసి, ఆ నోటులో అప్పులు ఇచ్చిన వారి పేర్లు, సెల్ నంబర్లతో సహా ఎంత మొత్తంలో అప్పులు ఇచ్చింది, ఎంత వడ్డీకి ఇచ్చింది, ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది చాలా స్పష్టంగా రాసి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుని భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతదేహాన్ని నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్ పరిశీలించారు.