New Delhi : ఢిల్లీలో ఏసీ పేలిన ఘటనలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ మరణించాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని హౌజ్ ఖాస్ ఏరియాలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధండేకర్ కుమార్ (80) అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ఏరియాలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోని ఏసీ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించి, పూర్తిగా పొగ అలుముకుంది.
ఈ పొగ కారణంగా ఊపిరాడకపోవడంతో ధండేకర్, అతడి కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇంట్లో మంటలు వ్యాపించినట్లు హౌజ్ ఖాస్ పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్తలానికి వెళ్లి, సహాయక చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిని సహాయక సిబ్బంది రక్షించారు. అస్వస్థతకు గురైన ధండేకర్ కుమార్, అతడి తనయుడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధండేకర్ కుమార్ మరణించారు.
అతడి కొడుకుకు చికిత్స కొనసాగుతోంది. అయితే, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్తలంలో ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి అనుమానిత చర్య లేదని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పలు చోట్ల ఏసీలు పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అందులోనూ ఢిల్లీలో భారీ ఎండల కారణంగా ఏసీలు కూడా తరచూ పాడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీల వినియోగంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.