Mallu Batti Vikramarka | వచ్చే వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రజా భవన్ లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో అధికారులతో రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. వేసవిలో విద్యుత్ అంతరాయం అనే మాట తలెత్తకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ నిరాటంకంగా సరఫరా చేయాలని ఆదేశించారు. వేసవి ప్రణాళిక అమలులో భాగంగా సీఎండీలు మొదలు ఎస్ఈల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు.
108 తరహాలోనే విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. 1912 కు వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని, ఈ వ్యవస్థ నిర్వాహణ ప్రచారానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్పీడీసిఎల్ పరిధిలో వచ్చే మార్చిలో పీక్ డిమాండ్ కు అనుగుణంగా 6328 మెగా వాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి కావలసిన అన్నీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేసవిలో పీక్ డిమాండ్ ను తట్టుకునే విధంగా ట్రాన్స్ మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సబ్ స్టేషన్ల వారీగా ఓవర్ లోడ్ సమస్యలను గుర్తించి ముందే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవేళ ఈదురు గాలుల వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఈఆర్టీ (ఎమర్జెన్సీ రీస్టోర్ టీం) వాహనాలను వాడుతున్నారని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ డీ కృష్ణ భాస్కర్, ఎన్పీడీసిఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.