హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అధికారులతోపాటు హైదరాబాద్లో ఆ శాఖకు సంబంధించిన జలసౌధ భవన సముదాయమంతా నిఘానీడలోకి వెళ్లిపోయింది. గుర్తింపు కార్డు (ఐడీ) ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. మీడియానే లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఇంజినీర్లను తప్పించడంతోపాటు తెలంగాణ ఇంజినీర్లపై నిఘా కొనసాగిస్తున్నది.
ఎవరితో మాట్లాడవద్దని, ఎవరికీ సమాచారాన్ని ఇవ్వద్దని ఇంజినీర్లకు హుకుం జారీ చేస్తున్నది. అందుకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నది. మరికొందరిపై పార్టీ ముద్ర వేసి ఇబ్బందుల పాలు చేస్తున్నది. దీంతో ‘తెలంగాణపై ఆంక్షలు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ తాజాగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన తప్పులను సరిదిద్దుకోకుండా 24 గంటల్లోనే మరో హుకుం జారీ చేసింది. తద్వారా ఇంజినీర్లపైనే కాకుండా ఏకంగా జలసౌధ భవన సముదాయమంతా నిఘాను కట్టుదిట్టం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గుర్తింపు కార్డు ఉన్నవారినే జలసౌధలోకి అనుమతించాలని సెక్యూరిటీ గార్డులను ఆదేశించింది. ఈ మేరకు జలసౌధ ప్రధాన ద్వారా వద్ద, లిఫ్టుల వద్ద నోటీసులను అంటించింది.