యాసంగి సాగు బంద్
అనుకున్నదంతా అయ్యింది! సర్కార్ చేతులెత్తేసింది!! నదులు ప్రవాహాలతో హోరెత్తినప్పుడు చుక్క నీరెత్తకుండా ఆంధ్రా చంద్రబాబు కోసం కింది రాష్ర్టానికి వాడుకోమని వదిలేసి.. ఇప్పుడు తన వైఫల్యాన్ని ఎల్ నినో పైకి నెట్టేస్తున్నది రేవంత్ సర్కార్. భజన మీడియా దానికి చిడతలు వాయిస్తున్నది. బహుశా దేశ చరిత్రలో సొంత రాష్ట్రంలో పారే నీటిని పక్క రాష్ర్టానికి దానమిచ్చి ఇంతటి ద్రోహానికి పాల్పడిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా ఉండి ఉండదు.
- రేవంత్ హ్యాండ్సప్!
- పండుగ ఇనాం!
- సాగు నీళ్లు లేవు కరెంటూ లేదు
- రైతులు పంటలు వెయ్యొద్దు: సీఎం
- వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. ఎండిపోతయ్
- వ్యవసాయ మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్
- కరువుతో పరిస్థితి చేయిదాటి పోయింది
- మేమేం చేయలేం.. రైతులే సహకరించాలి
- క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి
- కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు వట్టిపోయినయ్
- రిజర్వాయర్లన్నీ ఖాళీ.. తాగునీళ్లకూ కష్టమే
- ఇప్పుడే 13లక్షల ఎకరాల్లో పంటలు ఎండినయ్
- మిగిలిన పంటను కాపాడేందుకు ప్రయత్నం
- సాగుకు అవసరమైన విద్యుత్తు అందిస్తున్నం
- రైతులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
అనుకున్నదంతా అయ్యింది! సర్కార్ చేతులెత్తేసింది!!
నదులు ప్రవాహాలతో హోరెత్తినప్పుడు చుక్క నీరెత్తకుండా ఆంధ్రా చంద్రబాబు కోసం కింది రాష్ర్టానికి వాడుకోమని వదిలేసి.. ఇప్పుడు తన వైఫల్యాన్ని ఎల్ నినో పైకి నెట్టేస్తున్నది రేవంత్ సర్కార్. భజన మీడియా దానికి చిడతలు వాయిస్తున్నది. బహుశా దేశ చరిత్రలో సొంత రాష్ట్రంలో పారే నీటిని పక్క రాష్ర్టానికి దానమిచ్చి ఇంతటి ద్రోహానికి పాల్పడిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా ఉండి ఉండదు.
ఇటు కాళేశ్వరం బాగు చేసి నీటిని ఎత్తి పోయకుండా ఉత్తర తెలంగాణను, అటు అర కిలోమీటర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణను ఈ సర్కార్ నిలువునా ముంచింది. నీళ్లన్నీ వెళ్లిపోయాక, అంతా అయిపోయాక పాలమూరు పంపులు నడిపి నాటకానికి తెర తీసింది. మనకు హక్కుభుక్తమైన నదుల జలాలను గురువు కోసం ధారపోసింది. క్యాబినెట్లో ఉన్న ఏ ఒక్క మంత్రీ నోరెత్తలేదు.
చేలలో కండ్లముందు పంటలు ఎండి పోతుంటే చూడలేక.. బతికించుకోలేక రైతులు గోడుగోడున విలపిస్తున్నారంటే అది నూటికి నూరుశాతం ఈ సర్కార్ చేతగాని, చేవలేని తనమే. ఈ దేశంలో ఎందరెందరో సీఎంలుగా పని చేశారు. అందులో తమ రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటి కోసం కేంద్రంతోనూ, కోర్టుల్లోనూ యుద్ధాలు చేసిన వారున్నారు. కానీ ప్రకృతి ఇచ్చిన నీటిని పక్క రాష్ర్టానికి ధారపోసిన సీఎంను మాత్రం తొలిసారి చూస్తున్నాం.
తమ రాష్ట్రం కోసం ప్రజలు, రైతుల కోసం ఎందరు సీఎంలు ఎన్ని యుద్ధాలు చేశారో! కావేరీ నీటి విడుదల కోసం తమిళనాడులో ఎంజీఆర్ నుంచి మొదలుకొని జయలలిత, స్టాలిన్ దాకా సీఎంలంతా నిరాహార దీక్షలు జరిపి కేంద్రాన్ని కదిలించిన వారే. ఢిల్లీలో తాగునీటి అవసరాల కోసం హర్యానాతో రాజకీయ యుద్ధాలు చేసిన సీఎంలున్నారు. ఎందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తట్టుకొని నర్మదా వంటి భారీ ప్రాజెక్టులు కట్టిన వారున్నారు. మహారాష్ట్రలో చెరుకు రైతులకు నీటి కోసం పవార్ లాంటి నాయకులు ఉద్యమాలు చేసిన ఉదంతాలున్నాయి. రైతు బిడ్డగా పుట్టి రైతు కష్టం తెలిసిన, నీటి విలువ తెలిసిన దేవెగౌడ వంటి వారు కృష్ణా నది పొడవునా భారీ ప్రాజెక్టులు కట్టారు. అపర భగీరథుడు కేసీఆర్ తెలంగాణ నీటి కష్టాలను తీర్చడానికి కేవలం మూడున్నర ఏండ్లలో నే కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టును కట్టి చూపించారు. దక్షిత తెలంగాణ కోసం పాలమూరు ప్రాజెక్టును సిద్ధం చేశారు. చెరువులను బాగు చేసి, వాగులపై అడుగడుగునా చెక్‌డ్యాములు కట్టారు.
కానీ, వెన్నుపోటు పార్టీలో పుట్టి పెరిగి పంటభూముల్లో కమర్షియల్ విలువను తప్ప పచ్చని ధాన్యలక్ష్మిని చూడని వాళ్లకు రైతు అర్థం కాలేదు. నీటి విలువ తెలిసిరాలేదు. కాంట్రాక్టులు, కమీషన్లు, కప్పాలు మరిగిన సర్కార్ తెచ్చి పెట్టిన విపత్తు ఇది. ప్రకృతి తెచ్చే కరువుకు పరిహారం ఉన్నది గానీ ప్రభుత్వం తెచ్చిన కరువుకు పరిహారం ఉండదు కదా?! ఇదా అభయహస్తం.. ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన? సిగ్గు అనిపిస్తలేదా?

హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): కరువుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయి దాటిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తామేం చేయలేమంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తంచేశారు. కరువును ఎదుర్కొనే భారాన్ని ప్రజలు, రైతులపైనే మోపారు. పెద్దమనస్సుతో అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ప్రజలకు, రైతులకు భరోసా ఇవ్వకుండా మరింత భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక వట్టిపోయాయని, పంటలకు సాగు నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తాగునీళ్లకు కూడా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే యాసంగిలో పంటలు సాగు చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా వరి సాగును పూర్తిగా బంద్ చేయాలని సూచనలాంటి హెచ్చరిక జారీ చేశారు. పంటలకు సాగు నీళ్లు, కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చేతులెత్తేశారు. ఇప్పుడున్న నీళ్లు నార్లకే సరిపోతాయని, ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా పంటలు సాగుచేస్తే అది రైతుల కర్మ అనే విధంగా మాట్లాడారు. పంటలు సాగు చేస్తే సాగునీళ్లు, కరెంట్ లేక ఎండిపోవడం ఖాయమని, రైతులు నష్టపోవడం పక్కా అని స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఎల్ నినో, కరువు పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్టే ఎల్ నినోతో ఇప్పుడు చేయి దాటే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నీటి సమస్యే కాకుండా విద్యుత్ సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారని స్పష్టంచేశారు.
పంటల సీజన్ వాయిదా వేసుకోండి
‘తెలంగాణ సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రకృతి ప్రకోపించింది. ఈ రోజు ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏ ప్రభావమైనా ముందు రైతులపైనే పడుతుంది.’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, కానీ వరికి చాలా నీళ్లు కావాలని పేర్కొన్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నదని, కొనుగోలు చేద్దామన్నా దొరుకడం లేదని చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో చలికాలానికి ముందే వట్టిపోయే పరిస్థితి ఉన్నదని, గతంతో పోల్చితే కృష్ణా బేసిన్లో 72శాతం, గోదావరిలో 40శాతం తక్కువ నీళ్లు ఉన్నాయన్నారు. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో సాగునీళ్లు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 209 టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నీళ్లు నార్లకే సరిపోతాయని, పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. ఒకవేళ సాగుకు నీళ్లు ఇస్తే ఇక తాగునీళ్లు అసలే ఇవ్వలేమన్నారు. యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలని, డిసెంబర్లో నార్లు పోసి పంటలు వేయడానికి వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. ఒక సీజన్ పంట వేయడం వాయిదా వేసుకొని ఆ నీళ్లను పొదుపుగా వాడుకొని.. తాగడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా వరి పంట వేస్తే నారు మళ్లకే నీళ్లు అందించలేక పంటలు ఎండిపోతాయని, మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతాయని, రైతులు పెద్ద మనసు చేసుకొని వరి పంటను ఒక సీజన్ వాయిదా వేసుకోవాలని కోరారు.
12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..
వానకాలానికి ముందే పంటల సాగు తగ్గించాలని సూచించినా రైతులు సాగు చేశారని, కానీ సాగు, కరెంట్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టు గుర్తించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మిగిలిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంటలకు నీళ్లు అందించేందుకు 30 లక్షల పంపుసెట్లు ఆన్ చేయడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిందని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు.
మేం ఏం చేయలేం… రైతులు, ప్రజలపైనే భారం
కరువును ఎదుర్కోవడంలో, దీన్ని నుంచి ప్రజలు, రైతులను బయటపడేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేసినట్టు కనిపించింది. అందుకే నిస్తేజంగా ఇక ప్రభుత్వం తరఫున ఏం చేయలేమన్నట్టు తేల్చిచెప్పారు. భారమంతా ప్రజలు, రైతులపైనే నెట్టేశారు. ఒక్క ప్రభుత్వమో లేక ముఖ్యమంత్రో, లేక అధికారో చేస్తే ఈ కరువు బయటపడలేమని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కుల సంఘాలు, మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా నిలబడి ప్రకృతి విపత్తును ఎదుర్కొందామని కోరారు. ఇది మనందరి సమస్య.. మనందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య.. ఇది మానవులకు వచ్చిన సమస్య అంటూ వేదాలు వల్లించడం గమనార్హం. అదే విధంగా మీడియా, నిపుణులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూనే, వ్యతిరేక వార్తలు రాయొద్దని చెప్పారు. సినీనటులతో ప్రచారం చేయించాలని సూచించారు. కళాజాత బృందాలు కూడా మాటలు, పాటల రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రజలు అండగా నిలబడాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
కేంద్రంపైనే పరిహార భారం
సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పగానే.. కరువుతో జరిగిన పంట నష్టానికి, యాసంగిలో జరుగబోయే నష్టానికి ప్రభుత్వం తరఫున రైతులకు పరిహారం ప్రకటిస్తారేమోనని భావించారు. కానీ సీఎం మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వంపై నెట్టేశారు. వానకాలం పంట నష్టపోయిన పంటకు, యాసంగిలో పంట వేయకుండా జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, విపత్తు నిధుల నుంచి రాష్ర్టానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం తీసుకోవాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ర్టాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మిగిలిన రాష్ర్టాలకు ఇవ్వాలని చెప్పారు. అది కూడా సబ్సిడీలో విద్యుత్‌ను అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 8-10 నెలలకు ఎంత విద్యుత్ అవసరం అవుతుందో, మన వద్ద ఎంత ఉందో లెక్క వేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై దసరా తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సబ్ కమిటీ, అధికారులు అందించే నివేదికల ఆధారంగా తన నేతృత్వంలో అఖిలపక్ష బృందం నవంబర్ మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయంపై నివేదిక అందిస్తామని తెలిపారు. మీడియాకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావును నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్‌శాఖ పనితీరు భేష్…
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం విద్యుత్‌శాఖ పనితీరును ఆకాశానికెత్తారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ పనితీరు బాగున్నదని కితాబిచ్చారు. అదే విధంగా దీనికి ఒక్క రోజు ముందు అంటే బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. విద్యుత్‌శాఖ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరే కొరతకు కారణమంటూ చిందులేశారు. ఐపీఎస్ అధికారులను సైతం సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు.. తెల్లారేసరికి యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ ఎస్ఈ బీ సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాతరోజే మెచ్చుకోవడం గమనార్హం. రైతులకు, ఇతర అవసరాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నదని, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసి చిత్తశుద్ధి చూపించారని మెచ్చుకున్నారు.
ప్రశ్నలడిగితే పెయిడ్ అంటారా?
మీడియా సమావేశంలో భాగంగా పలువురు జర్నలిస్టులు సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తొలుత కాంగ్రెస్ తెచ్చిన కరువు విమర్శలపై, విద్యుత్, బొగ్గు కొరత విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత మెడికవర్ ఆసుపత్రిలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడి భాగస్వామిగా ఉన్నారని వస్తున్న ఆరోపణలపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆయన ఊగిపోయారు. దీనికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి ప్రయత్నించారు. ఈ ప్రశ్నలను పెయిడ్ ప్రశ్నలుగా నిందించారు. అంటే తనకు నచ్చిన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పిన సీఎం.. నచ్చని ప్రశ్నలను మాత్రం పెయిడ్ ప్రశ్నలుగా ముద్రవేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక విదేశీ బొగ్గు కొనుగోళ్లపై విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ఏ విచారణ చేయమంటారో చెప్పాలని కేటీఆర్‌ను కోరారు.
ఎల్ నినో సన్నద్ధతపై చేతులెత్తేసిన సర్కార్
ఎల్ నినో సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరచింది. తరుముకొచ్చిన కరువును ఎదుర్కొనే తరుణోపాయం ఆలోచించాల్సిన సర్కార్ ప్రజలను భయపెట్టింది. ధైర్యాన్ని నూరిపోయకుండా ఇది ప్రపంచాన్ని ముంచెత్తే విపత్తని, చెట్లూ పిట్టలకు కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళనకు గురిచేసింది. ఎల్ నినో సన్నద్ధతపై తీసుకుంటున్న చర్యలేందో చెప్పకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సర్కార్ నిస్సహాయత బట్టబయలైంది. కరువు పరిస్థితులను ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కొంటుందో మాటమాత్రంగా కూడా చెప్పలేదు. ఇందుకోసం విడుదల చేసే నిధుల గురించి కనీస ప్రస్తావనలేదు.
కరువు మండలాల ప్రకటన ఊసేలేదు. ప్రాజెక్టుల్లోని నీటిని వాడుకొనే విషయంలో ప్రణాళికలేదు. ఉపాధి కల్పన గురించి మాటెత్తలేదు.కానీ, రైతులు పంటలు సాగుచేయొద్దని, గృహస్తులు కరెంటు వినియోగం తగ్గించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఉచిత సలహాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. కరువును ఎదుర్కొనేందుకు సర్కార్ తీసుకొంటున్న చర్యల గురించి ప్రస్తావించని ముఖ్యమంత్రి కళాబృందాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యవంతం చేయాలని, జర్నలిస్టులు పత్రికల్లో వ్యాసాలు రాసి ప్రజలను మేల్కొలపాలని, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లుయెన్సర్లు వివిధ సామాజిక వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచనలు చేయడం విస్మయపరిచింది. రానున్న రోజుల్లో కరెంటు కటకట తప్పదని, గుక్కెడు నీటి కోసం ప్రజలు అరిగోస పడాల్సివస్తుందని చెప్పకనే చెప్పడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

