సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం!
సివిల్ సైప్లెలో మహబూబాబాద్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇండ్లపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కండ్లు బైర్లు కమ్మే అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.9.41 కోట్లుగా చెప్తున్నప్పటికీ, మార్కెట్ విలువ మాత్రం రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. సివిల్ సైప్లెలో ఒక జిల్లా అధికారి ఇంత భారీస్థాయిలో ఆక్రమ ఆస్తులతో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
- డీఎంలు, డీఎస్‌వోల బరితెగింపు ..మిల్లర్లు, కాంట్రాక్టర్లతో మిలాఖత్
- ధాన్యం కేటాయింపులతోపాటు సీఎమ్మార్‌లో భారీగా అవినీతి
- గన్నీలు, రవాణా బిల్లులపై కమీషన్లు అనితికాలంలోనే కోట్లల్లో అక్రమార్జన
- ఏసీబీకి పట్టుబడ్డ మహబూబాబాద్ డీఎం 100 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అంచనా
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): సివిల్ సైప్లెలో మహబూబాబాద్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇండ్లపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కండ్లు బైర్లు కమ్మే అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.9.41 కోట్లుగా చెప్తున్నప్పటికీ, మార్కెట్ విలువ మాత్రం రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. సివిల్ సైప్లెలో ఒక జిల్లా అధికారి ఇంత భారీస్థాయిలో ఆక్రమ ఆస్తులతో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. నరసింహారావు శాంపిల్ మాత్రమేనని, సివిల్ సైప్లెలో అంతకుమించిన అవినీతిపరులు ఉన్నారనే చ ర్చ నడుస్తున్నది. అన్ని జిల్లాల డీఎంలు, డీఎస్వోలు, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కీలక విభాగాలకు చెందిన అధికారులపై ఇదే తరహాలో ఏసీబీ దాడులు చేస్తే సివిల్ సైప్లె అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోట్లకు పడగలెత్తిన డీఎం, డీఎస్వోలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనిచేసి, ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో ఉన్న ఓ డీఎం రెండేండ్లలోనే సుమారు రూ.5 కోట్లు అక్రమార్జన చేసినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండలో ఉన్న మరో డీఎం కనీసంగా రూ.10 కోట్లు అక్రమ సంపాదన వెనుకేసినట్టు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్లిన మరో డీఎం సైతం కోట్లాది రూపాయలు అక్రమార్జన ద్వారా కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల కన్నా సివిల్ సైప్లెలో జిల్లా మేనేజర్ (డీఎం) లేదా జిల్లా సివిల్ సైప్లె ఆఫీసర్ (డీసీఎస్వో) పోస్టింగే పవర్ఫుల్ అనే చర్చ నడుస్తున్నది. మిల్లర్లతో మిలాఖత్, కాంట్రాక్టర్లతో కమీషన్లు ఇలా ఎక్కడ చేయి పెట్టినా, ఎక్కడా కాలుపెట్టినా ఈ అధికారులకు అవినీతి కాసుల వర్షమే అనే ఆరోపణలున్నాయి. జిల్లాల్లో ఏండ్లకు ఏండ్లుగా తిష్టవేస్తూ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఒక్కో జిల్లా అధికారి ఆస్తులు లెక్కిస్తే, వందల కోట్లకు ఏ మాత్రం తగ్గవనే చర్చ జరుగుతున్నది. జిల్లాల్లో డీఎం, డీఎస్వోగా పనిచేయడమంటే జీవితంలో సెటిల్ అయినట్టేనన్న అభిప్రాయం సివిల్ సైప్లె అధికార వర్గాల్లో నెలకొనడం పరిస్థితికి అద్దం పడుతున్నది. కీలకమైన జిల్లాలు దక్కితే తరతరాలకు సరిపడా అవినీతి సొమ్మును కూడబెట్టినట్టేనట! మిల్లులకు ధాన్యం కేటాయించడం, సీఎమ్మార్ తీసుకోవడంలో మాయాజాలం, రేషన్ బియ్యం రవాణా టెండర్లు, గోదాముల నిర్వహణ, గన్నీ సంచుల టెండర్లు, ధాన్యం రవాణా టెండర్లు ఇలా ఒక్కటేమిటి కాదేదీ అవినీతికి అనర్హం అనేలా జిల్లా అధికారుల అవినీతి పర్వం కొనసాగుతున్నదనే ఆరోపణలున్నాయి.
మిల్లర్లు, జిల్లా అధికారులు తోడుదొంగలు
కంచే చేను మేసినట్లుగా మిల్లర్ల అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన సివిల్ సైప్లె జిల్లా అధికారులు ఆ అవినీతిలో భాగస్వామ్యమయ్యారు. మిల్లర్లతో మిలాఖత్ అయిన అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటు మిల్లర్లు, అటు సివిల్ సైప్లె జిల్లా అధికారులు తోడుదొంగల్లా తయారయ్యారనే ఆరోపణలున్నాయి. ధాన్యం కొనుగోళ్ల నుంచి మొదలుకొని బియ్యం (సీఎమ్మార్) అప్పగించే వరకు మిల్లర్ల అవినీతికి మడుగులొత్తుతూ వారిచ్చే సొమ్ముతో ఎదుగుతున్నారనే ఆరోపణలున్నాయి. డీఫాల్ట్ మిల్లర్లతో అధికారులు మిలాఖత్ అయి వారికి నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయిస్తున్నారని, ఇందుకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
సీఎమ్మార్ బియ్యం తీసుకోవడంలోనూ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో ఏసీకేకు మిల్లును బట్టి రూ.20 వేల వరకు వసూలు చేస్తారని తెలిసింది. ఒక్కో మిల్లు సుమారు 15-30 ఏసీకే బియ్యం సరఫరా చేస్తుంది. అంటే ఈ లెక్కన ఒక్కో మిల్లు నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు అంచనా. సీఎమ్మార్‌లో రీ సైక్లింగ్ బియ్యం తీసుకొనేందుకు సైతం పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్ల వద్ద ప్రస్తుతం రూ.6,630 కోట్ల విలువైన ధాన్యం ఉన్నది. ఇంత భారీ మొత్తంలో ధాన్యం పేరుకొనిపోవడానికి జిల్లా అధికారులు మిల్లర్లతో కుమ్మక్కు కావడమే కారణమనే విమర్శలున్నాయి.
గన్నీ, ట్రాన్స్పోర్ట్ టెండర్లు.. 3% కమీషన్!
మిల్లర్లతో మిలాఖత్ అవుతూ సంపాదించే అవినీతి సొమ్ము సరిపోవడం లేదో ఏమోగానీ టెండర్లలో కమీషన్ల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పనేదైనా సరే 3% కమీషన్ ముట్టజెప్పాల్సిందే. గన్నీల టెండర్లు, కొనుగోలు చేసిన ధాన్యం రవాణా టెండర్లు, పీడీఎస్ రైస్ రవాణాకు సంబంధించి స్టేజ్-1 టెండర్లు ఇలా ప్రతి పనిలోనూ కమీషన్లు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. గన్నీలకు సంబంధించి జిల్లా అధికారులకు కచ్చితంగా కోటి రూపాయల బిల్లుకు రూ.3 లక్షలు ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. ప్రతి సంవత్సరం పాత గన్నీ సంచుల కొనుగోలు కోసం రూ.600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన కమీషన్ల రూపంలో రూ.18 కోట్లు వసూలు చేస్తుండటం గమనార్హం. ట్రాన్స్పోర్ట్ టెండర్లకు సంబంధించి కూడా 3% కమీషన్ వసూలు చేస్తున్నారని తెలిసింది. పీడీఎస్ రైస్ రవాణాకు సంబంధించిన టెండర్లలోనూ భారీ మొత్తంలో కమీషన్లు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఆ జిల్లాల్లో అవినీతి రాజ్యం!
ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో అవినీతి మరింత రాజ్యమేలుతున్నదనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సివిల్ సైప్లెలో పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. ఈ జిల్లాల్లో డీఎం, డీసీఎస్‌వోలుగా చేసిన అధికారులు భారీ మొత్తంలో అవినీతి సొమ్ము వెనుకేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో పనిచేసిన అధికారులు ఇక తమకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో అక్రమార్జన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడరని, ఆ జిల్లాలను వదిలిపెట్టేందుకు ఇష్టపడరని తెలిసింది. నిరుడు ఉమ్మడి నల్లగొండ నుంచి ఓ జిల్లాకు డీఎంగా వెళ్లిన ఓ అధికారిని ఆ తర్వాత ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. కొద్దికాలంలోనే మళ్లీ ఆయన ఉమ్మడి మెదక్‌లోని కీలక జిల్లాకు డీఎంగా వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
అప్పుల్లో సివిల్ సైప్లె.. కోట్లకు అధికారులు
సివిల్ సైప్లె కార్పొరేషన్ రోజురోజుకీ అప్పుల్లో కూరుకొనిపోతుంటే, ఇందులోని ఉద్యోగులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సివిల్ సైప్లె కార్పొరేషన్ అప్పులు రూ.1.10 లక్షల కోట్లకు చేరాయని చెప్తున్నారు. తాజాగా ఈ వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం మరో రూ.17,300 కోట్లు మార్క్‌ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు, పీడీఎస్‌కు ప్రభుత్వం నుంచి నయా పైసా రావడంలేదు. దీంతో సివిల్ సైప్లెకు అప్పులే శరణ్యంగా మారాయి. సంస్థ ఏమైనా పర్వాలేదు.. తాము బాగుంటే చాలనే ధోరణిలో అధికారులు ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మిల్లర్లతో మిలాఖత్ అవుతూ, వారి అవినీతికి వంత పాడుతూ సంస్థను మరింత పాతాళంలోకి నెట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అవినీతి సొమ్ము.. పంపకాలు
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా సివిల్ సైప్లెలో జరుగుతున్న అవినీతి బాగోతంలో అందరి పాత్ర ఉన్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి సొమ్మును ఇటు సివిల్ సైప్లె, అటు రెవెన్యూ శాఖ అధికారులు పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా సవిల్ సైప్లె అధికారులు ఉమ్మడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు, సివిల్ సైప్లె అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అడిషనల్ కలెక్టర్లు కూడా అందులో భాగస్వాములవుతున్నారనే చర్చ జరుగుతున్నది.
సివిల్ సైప్లె ప్రధాన కార్యాలంలోని అధికారులు సైతం తామేమీ అవినీతికి అతీతులం కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు.. జిల్లాల్లో వసూళ్లలో ప్రధాన కార్యాలయంలోని అధికారులకు వాటా అందుతున్నదనే ఆరోపణలున్నాయి. దీనికితోడు ఇక్కడ నేరుగా జరిగే వ్యవహారాలు, బిల్లుల చెల్లింపుల్లో అదనంగా వాటాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ సివిల్ సైప్లెపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సివిల్ సైప్లె కమిషనర్‌గా ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర నియమితులైన తర్వాత అవినీతిని కొంతమేర కట్టడి చేశారనే చర్చ నడుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

