కన్స్ట్రక్షన్ హాలిడే!
రాష్ట్రంలో ఇప్పటివరకు పవర్ హాలిడేలు.. క్రాప్ హాలిడేలే చూసుంటారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ హాలిడే కూడా రాబోతున్నది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ హాలిడే వచ్చి ఉండదు.
- ప్రభుత్వ విధానాలు, మెటీరియల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సెలవు?
- నవంబర్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల సంఘాల భేటీకి నిర్ణయం?
దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కన్స్ట్రక్షన్ హాలిడే వచ్చి ఉండదు. కానీ తెలంగాణలో రాబోతున్నది. ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా.. 22ఏ భయం.. ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడం, మెటీరియల్ ధరలు పెరుగడమే ఇందుకు కారణమైంది. నిర్మాణ పనులు చేపట్టాలంటే బిల్డర్లలో వణుకు పుడుతున్నది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బిల్డర్స్ ఫోరం (టీబీఎఫ్)కు నాయకులు భేటీ అయి కన్స్ట్రక్షన్ హాలిడే ప్రకటించాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు పవర్ హాలిడేలు.. క్రాప్ హాలిడేలే చూసుంటారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ హాలిడే కూడా రాబోతున్నది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ హాలిడే వచ్చి ఉండదు. ఇందుకు ప్రభుత్వ విధానాలు సగం కారణమైతే మరో సగం పెరుగుతున్న మెటీరియల్ ధరలు.. తగ్గిన అమ్మకాలు కూడా కారణం. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పలువురి జీవనాధారం రియల్ ఎస్టేట్ రంగమే.
రియల్ ఎస్టేట్ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా గణనీయంగానే ఉంటుంది. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం రేవంత్‌రెడ్డి పాలనలో పడకేసింది. హైదరాబాద్‌లో ఇండ్లు కొనేందుకు వినియోగదారులు భయపడుతుంటే.. ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు బిల్డర్లు భయపడుతున్నారు. దేశంలో ఇప్పుడు అతి ఎక్కువ అన్‌సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న రాష్ట్రం తెలంగాణ. పరిశ్రమ మొత్తం కుదేలై ఉన్నది. చిన్న బిల్డర్లే కాదు.. పెద్దపెద్ద బిల్డర్లు కూడా ఓవైపు పెరుగుతున్న మెటీరియల్ ధరలు.. మరోవైపు ప్రభుత్వ విధానాలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
తాజాగా తెలంగాణ బిల్డర్స్ ఫోరం (టీబీఎఫ్)కు చెందిన నాయకులు భేటీ అయినట్టు తెలిసింది. ప్రభుత్వం క్రాప్ హాలిడే.. పవర్ హాలిడే ఇచ్చినట్టుగానే కన్స్ట్రక్షన్ హాలిడే ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారు. దీనిపై మెజారిటీ నాయకులు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. వచ్చే నవంబర్‌లో ఫోరం ఆధ్వర్యంలోనే క్రెడాయ్, నరెడ్కో, నగరంలో ఉన్న వివిధ బిల్డర్స్ అసోసియేషన్లతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
పెరిగిన మెటీరియల్ ధరలు
భవన నిర్మాణాలకు సంబంధించిన సిమెంట్, ఇసుక, విద్యుత్తు పరికరాలు, కేబుళ్లు, రంగులు వంటివాటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. కార్మికులకు చెల్లించే కూలీలు కూడా పెరిగాయి. వీటన్నింటితోపాటు బ్యాంకు వడ్డీలు కూడా పెరిగిపోయాయి. ప్రాజెక్టులను మొదలుపెట్టినప్పుడున్న ధరలు ప్రాజెక్టును పూర్తిచేసే సమయం వరకు ఉండటంలేదు.దీంతో బిల్డర్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నారు.
అనుమతుల ప్రక్రియలో ఆలస్యం
ఇక పెరిగిన వ్యయంతోనే ఇబ్బందులు పడుతున్న బిల్డర్లు తమ ప్రాజెక్టుకు తుది అనుమతులు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారికంగా ఒక చదరపు అడుగుకు అనుమతి కావాలంటే ప్రభుత్వ పెద్దలకు కనీసం రూ.50 నుంచి రూ.150 వరకు చెల్లించుకోవాల్సిందే. లేకపోతే అనుమతులు రావడంలేదు. కొన్ని సందర్భాల్లో అన్నీ ఇచ్చుకున్నప్పటికీ పనులు కావడంలేదని బిల్డర్లు వాపోతున్నారు. ల్యాండ్ కన్వర్షన్, నాలా కన్వర్షన్లకు ప్రభుత్వ అనుమతుల కోసం వెళ్లిన ఫైళ్లు కొన్ని వందల సంఖ్యలో ఆగిపోయాయని అంటున్నారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ గతంలో సింగిల్ విండో పద్ధతిలో జరిగేవి.
ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. నిర్ణీత గడవులోగా అనుమతులు రావడంలేదు. ఇదో ప్రహసనం. అలాగే, భవన నిర్మాణం పూర్తయితే దానికి ట్రాన్స్ఫార్మర్, విద్యుత్తు కనెక్షన్, ఫైర్ ఎన్వోసీ తెచ్చుకోవడం.. ఇవన్నీ ఎంతో ఇబ్బందులతో కూడుకున్నవని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిచోట తమను సతాయిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిల్డర్ ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు. నగరంలో కొన్ని వందల అపార్ట్మెంట్లకు, ప్రాజెక్టులకు ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు రాలేదని, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. ఓసీ ఇవ్వాలంటే కూడా మళ్లీ భారీగానే చేతులు తడపాల్సి వస్తున్నదని బిల్డర్లు వాపోతున్నారు.
తాజాగా నీళ్లు, కరెంటు కష్టాలు
ప్రభుత్వం ఎల్ నినో పేరుతో తమ ప్రాజెక్టులకు నీటిసరఫరా చేసేందుకు ముందుకురావడంలేదని, నీళ్లు లేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తిచేయడం, పూర్తిచేసినవాటిని కస్టమర్లకు ఇవ్వడం సాధ్యం కాదని బిల్డర్లు చెప్తున్నారు. విద్యుత్తు సరఫరా కూడా దారుణంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాణ పనులు చేయడం కన్నా కొంతకాలం అన్నీ వాయిదా వేసుకోవడమే మంచిదన్న భావనతో బిల్డర్లు ఉన్నారు. అందుకే కొంతకాలంపాటు ‘కన్స్ట్రక్షన్ హాలిడే’ ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

