హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేస్తాం’ అని గత ఏడాది మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే 10 నెలల్లోనే 63,669 ఉద్యోగాలకు అనుమతిచ్చారు. కొత్తగా భర్తీ చేసే ఉద్యోగులకు వేతనాల కోసం కూడా 2023-24 బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.
10 నెలల్లోనే 80 శాతం ఉద్యోగాలు
తెలంగాణలో 2022 ఉద్యోగ నామ సంవత్సరంగా సాగింది. కొత్తగా 98,171 కొలువులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ తర్వాత ఆర్‌అండ్‌బీతో పాటు మరికొన్ని శాఖల్లో కొత్త పోస్టులను సృష్టిస్తూ మరో 7,029 ఉద్యోగాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 63,669 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చేసింది. అంటే కేవలం పది నెలల్లోనే 80 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు. అదేవిధంగా, 43,240 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అంటే 54 శాతం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేసింది. గురుకులాల్లో 11,687 ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు నియామక సంస్థ ఏర్పాట్లు చేసింది. మరో వారం, పదిరోజుల్లోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. మరో 25,112 పోస్టులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు లెక్క. వీటన్నింటికీ మరో రెండు నెలల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది.
కొలువుల భర్తీ మరింత వేగం
కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో నిధులు కేటాయించటంతో కొలువుల భర్తీ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనున్నది. ఈ ఏడాది రెండో త్రైమాసికం లోపే 50 శాతానికి పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నది. గ్రూప్-1 వంటి కీలక ఉద్యోగాలతోపాటు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల వరకు అన్ని నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 18,404 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా, అందులో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయింది. జూన్ 4 నుంచి 12 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. గ్రూప్-2, 3, 4 పరీక్షలతోపాటు మిగిలిన పరీక్షల తేదీలను సైతం వెల్లడించింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొత్తగా 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసి మెయిన్ పరీక్ష తేదీలను ప్రకటించింది. వైద్యారోగ్యశాఖలో 7, 320 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులో 927 వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరలో పూర్తిచేయనున్నారు.
కొత్త ఉద్యోగాల వివరాలు
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇలా (నేరుగా భర్తీ)
ప్రధాన నియామక సంస్థల నోటిఫికేషన్లు
సంస్థ : ఉద్యోగాల సంఖ్య
టీఎస్పీఎస్సీ : 18,404
టీఎస్ఎల్పీఆర్బీ : 17,516
ఎంహెచ్ఆర్బీ : 7, 320
పదిరోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నోటిఫికేషన్లు
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
తెలంగాణలో అతి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం హర్షణీయం. ఒకవైపు అనుమతులు ఇస్తూనే, మరోవైపు నోటిఫికేషన్లు ఇవ్వడం గొప్ప విషయం. ఈ బడ్జెట్లో కొత్త ఉద్యోగాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వాటిని నమ్మొద్దు. ప్రిపరేషన్‌ను పక్కన పెట్టొద్దు. శ్రద్ధతో ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి వేతనం పొందండి.
-మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.
తెలంగాణ వైపు దేశం చూపు
గతంలో మనకు అవగాహన లేదని, పాలన చేతకాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధ్యం కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దోపిడీ లేని, స్వార్థం లేని పాలన ఉన్నందు వల్లే తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రతీ కేటాయింపుల్లో మానవీయ కోణం కనిపిస్తున్నది. అన్ని రంగాలకు సమానంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. దేశ సంపదను కేంద్రం అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నది. తెలంగాణలో కేసీఆర్ సార్ రైతును రాజును చేస్తున్నారు. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్నది.
-గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్
మాటలు కాదు..చేతల్లో చూపుతాం
రాష్ట్ర పద్దు ప్రభుత్వంపై నమ్మకాన్ని, అంచనాలను పెంచింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది. మాటలు కాదు.. చేతల్లో చేస్తున్నారు కేసీఆర్. వ్యవసాయానికి పెద్దపీట వేసి జై జవాన్, జై కిసాన్‌కు సార్థకత చేకూర్చారు. విద్యుత్తు, ఇరిగేషన్ రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా నిధుల వరద పారించారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
-బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే