హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిందే రాజీవ్‌గాంధీ అని, ఇప్పుడు కాంగ్రెస్ తన సొంత నాయకుడి నిర్ణయాన్నే అవమానిస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరుపాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఫారం-6, ఫారం-7 సమర్పించిన వెంటనే ఎవరి ఓట్లూ రద్దవ్వవని, సమగ్ర విచారణ అనంతరమే నిర్ణయం ఉంటుందని చెప్పారు.
గతంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని స్వయంగా రాహుల్‌గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలే ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకు భయమని నిలదీశారు. ఏండ్ల తరబడి నకిలీ, బోగస్ ఓట్లతో కొందరు రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. దేశ పౌరుల ఓటు హకును ఎవరూ తొలగించలేరని, అయితే రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లను మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.