జీవో 14పై రగులుతున్న బీసీలు
బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 14 తీవ్ర వివాదానికి దారితీస్తున్నది. సర్కార్ ఆంక్షలు విధించడంపై కులసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
- సర్కార్ తీరుపై కులసంఘాల్లో సర్వత్రా ఆగ్రహం
- కాంగ్రెస్ మొదటి నుంచీ మోసం చేస్తున్నదని మండిపాటు తక్షణం జీవోను రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 14 తీవ్ర వివాదానికి దారితీస్తున్నది. సర్కార్ ఆంక్షలు విధించడంపై కులసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. తక్షణం జీవోను రద్దు చేయాలని హెచ్చరిస్తున్నాయి. గతంలో తరహాలోనే భవనాల నిర్వహణను ట్రస్ట్‌లకు అప్పగించి, నిర్మాణాలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బీసీల ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకని నిలదీస్తున్నాయి. ఇది బీసీ కులాలను కించపరచడమేనని భగ్గుమంటున్నాయి.
అదీగాక కాంగ్రెస్ సర్కార్ నూతన మార్గదర్శకాలతో కులాల్లో చిచ్చు రేపుతున్నదని, ఏకతాటిపైకి వచ్చిన సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర దాగిఉన్నదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నదని బీసీలు నిప్పులు చెరుగుతున్నారు. జాతీయనేత రాహుల్‌గాంధీ నోరు తెరిస్తే సామాజిక న్యాయమంటూ ప్రవచిస్తారని, రాష్ట్రంలో అదే కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని, సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నదని ధ్వజమెత్తుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు ఎమ్మెల్యే టికెట్లను ఇస్తామని నమ్మబలికి మొండిచెయ్యి చూపారని గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం 35 నెలల పాలనలో అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నారని వివరిస్తున్నారు. మంత్రి పదవులు, నామినెటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సుమారు 70కి పైగా కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్లను నియమించిందని, సుమారు 31 కార్పొరేషన్లు రెడ్డి వర్గానికి కేటాయించిందని, బీసీలకు నామమాత్రంగా 12 మాత్రమే ఇచ్చిందని, అవీ బీసీ కార్పొరేషన్లరీత్యా వచ్చినవే తప్ప అందులో కాంగ్రెస్ గొప్పతనమేమీ లేదని వివరించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లోనూ కాంగ్రెస్ ఇదే వైఖరిని అవలంభించిందని భగ్గుమంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు, ఏటా 20 వేల కోట్ల బడ్జెట్, బీసీ సబ్‌ప్లాన్ ఉత్తముచ్చటగానే మిగిలిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా మళ్లీ ఆత్మగౌరవ భవనాలపై నిర్వహణ హక్కులకు సైతం గండికొట్టే చర్యలకు పూనుకున్నదని, ఇది బీసీలను అవమానించడమే తప్ప మరేమీ కాదని వివరిస్తున్నారు. జీవో 14ను తక్షణం రద్దు చేయాలని, లేదంటే ఉద్యమాలకు శ్రీకారం చుట్టకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భూములను లాక్కునే ఉద్దేశం లేదు: బీసీ శాఖ
ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన భూములను లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బీసీ సంక్షేమశాఖ వెల్లడించింది. కేవలం పారదర్శకత, జవాబుదారీతనం కోసమే జీవో 14ను జారీ చేసినట్టు వివరించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బీసీల ఆత్మగౌరవంపై కాంగ్రెస్ సరార్ పెత్తనం’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని ఖండించింది. సవరించిన మార్గదర్శకాలపై వివరణ ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాల భూములను వెనకి తీసుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, ఆయా కమ్యూనిటీలకు ఉద్దేశించిన సంస్థలు, సౌకర్యాలను దూరం చేసే ఆలోచన కూడా లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వ భూములను, ప్రజాధనాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగించేలా చూసేందుకు మార్గదర్శకాలను సవరించామని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేసి, బీసీ సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

