నమస్తే తెలంగాణ నెట్వర్క్: తీన్మార్ మల్లన్న అసలు జర్నలిస్టు కాదని, ఫేక్ జర్నలిస్టని, అనేక పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఇటువంటి చీటర్‌పై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను సీఎం కేసీఆర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన బోధన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తీన్మార్ మల్లన్నా.. ఖబడ్దార్.. నీవు పెద్ద చీటర్‌వి.. బ్లాక్ మెయిలర్వి.. కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదు’ అని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఆయన కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాన్షుపై బాడీ షేమింగ్ చేసిన మల్లన్నపై కరీంనగర్లో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ గోడకు తీన్మార్ మల్లయ్య మరుగుదొడ్డి అని పేరుపెట్టి టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చిత్రపటాన్ని వేలాడదీసి చెప్పులతో, మరుగుదొడ్డిలోని చీపుర్లతో కొట్టారు. తీన్మార్ మల్లన్నకు బుద్ధి రావాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద ఆయన చిత్రపటాలను అంటించాలని పిలుపునిచ్చారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్ చానల్లో అబద్ధాలు, అసత్యాలు, నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తూ, రాష్ట్ర ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్న తీన్మార్ మల్లన్న బెయిల్ రద్దు చేయాలని టీఆర్ఎస్ న్యాయ విభాగం డిమాండ్ చేసింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి, డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నది. పీర్జాదిగూడలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది.