తిమ్మాపూర్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం సాక్షిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో స్మార్ట్రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బోడి టీచర్ ఉద్యోగం చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు ఎమ్మెల్యే కాకముందు గోసి, గొంగడితో వచ్చావ్.. బోడి టీచర్ ఉద్యోగం చేసినవ్.. ఎమ్మెల్యే అ యిన తర్వాత ఇన్ని ఆ స్తులు ఎలా వచ్చాయి’ అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయ వృత్తిని విమర్శించడం ఏమిటని మండిపడుతున్నారు.
భావితరాన్ని ముందుకు నడిపించే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్షమాపణలు చెప్పాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి డిమాండ్ చేశారు. టీచర్స్డే రోజున ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడటంపై బాలకిషన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మూర్ఖుడు, బోడి టీచర్ ఉద్యోగం అంటూ కవ్వంపల్లి వ్యాఖ్యానించడం ఒక పూర్వ ఉపాధ్యాయుడిగా తనను కలిచివేసిందని, ఉపాధ్యాయ వృత్తిని అవమానపరిచిన కవ్వంపల్లి తరఫున తాను క్షమాపణ చెప్తున్నట్టు వెల్లడించారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో మీడియాతో రసమయి మాట్లాడారు. తనను విమర్శించే క్రమంలో బోడి టీచర్ అనడం ఉపాధ్యాయ వృత్తినే అవమానపరచడమని ఆవేదన వ్యక్తంచేశారు. కవ్వంపల్లి 20 ఏండ్లు నియోజకవర్గంలో అందరి కాళ్లు మొకుతూ తిరిగితే.. ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని ఎద్దేవాచేశారు. ప్రతిదానికీ అడుకుతినే కవ్వంపల్లికి పచ్చునూరులో 20 ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.