బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Apr 20, 2020 , 01:14:47

ఇంటర్నెట్‌ వాడుతున్నారా?

ఇంటర్నెట్‌ వాడుతున్నారా?

  • పిల్లలకు ఈ జాగ్రత్తలు నేర్పండి 
  • తల్లిద్రండులకు పలు సూచనలు జారీ చేసిన కేంద్రం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వల్ల అంతా ఇండ్లకే పరిమితం కావడంతో కాలక్షేపం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. పిల్లలైతే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి మొఖాలు బయటికి తీస్తలేరు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, సోషల్‌మీడియా సైట్లు, టిక్‌టాక్‌లు...ఇలా మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. వారిని వారించడం పెద్దలకు తలనొప్పిగా మారింది. అయితే ఇంటర్నెట్‌వల్ల పొంచి ఉండే ప్రమాదాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, కేంద్ర హోంశాఖ కూడా పలు మార్గదర్శకాలు జారీ చేసింది.  పిల్లలకు ఈ జాగ్రత్తలు నేర్పాలని పేర్కొంది.  

  • ఆన్‌లైన్‌ సేఫ్టీ గురించి పిల్లలతో చర్చించాలి. ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పిస్తే జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచనా విధానం వారిలో  పెరుగుతుంది. 
  • పిల్లలు ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతున్నప్పుటు పెద్దవాళ్లు గమనిస్తూ ఉండాలి. దీంతొ వారు ఏయే సైట్లు చూస్తున్నారో తెలుస్తుంది. 
  • పేరెంటల్‌ కంట్రోల్స్‌, సేఫ్‌సెర్చ్‌ ఆఫ్షన్స్‌ వినియోగించాలి. దీనివల్ల పిల్లలు చూడకూడని కొన్ని సైట్లను బ్లాక్‌ చేసే వీలుంటుంది. 
  • పిల్లలు ఇంటర్నెట్‌ను ఒంటరిగా వాడకుండా చూడాలి. వారు వాడే కంప్యూటర్‌ లేదా మొబైల్‌ అందరికీ అందుబాటులో ఉండేలా, అందరికీ కనిపించేలా చూడాలి. 
  • ఆన్‌లైన్‌లో గేమ్స్‌, ఇతర ఎంటర్‌టైన్‌మెం ట్‌ సైట్లు చూస్తున్నప్పుడు అందులో  ఫోన్‌నంబర్‌, పేర్లు, చిరునామా, ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్న విషయంపై పిల్లల్లో తప్పక అవగాహన కల్పించాలి. 
  • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో పరిచయం లేని కొత్త వ్యక్తులు రిక్వెస్ట్‌లను డిలీట్‌ చేయాలని చెప్పాలి.  
  • వీలైనంత వరకు ఇంటర్నెట్‌ వాడకానికి రోజులో కొంత పరిమిత సమయమే కేటాయించేలా పిల్లలకు నిబంధనలు పెట్టాలి. 
  • ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు ఎలాంటి ప్రకటనలు, పాప్‌అప్స్‌పైన, అనధికారిక లింక్‌లపై క్లిక్‌ చేయకుండా పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి. మాల్‌వేర్‌ వంటి వైరస్‌ల దాడి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి పిల్లలకు వివరంగా తెలియజేయాలి. 

రాష్ర్టాల పరిధిలోనే కార్మికులకు ఉపాధి

వైరస్‌ వ్యాప్తి లేని ప్రాంతాల్లో (గ్రీన్‌ జోన్లలో) ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని రంగాలకు పాక్షికంగా అనుమతించిన కేంద్రం, లాక్‌డౌన్‌ వల్ల పలు రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు సంబంధించి ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. కొన్ని షరతులతో ఆయా రాష్ర్టాల పరిధిలోనే కార్మికులకు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణం వంటి రంగాల్లో ఉపాధి పనులు కల్పించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సహాయ శిబిరాల్లో ఉన్నవారు రాష్ట్రంలోని వారి పని ప్రాంతాలకు వెళ్లదలిస్తే బస్సుల్లో తరలించేందుకు నిర్ణీత దూరం, సురక్షిత విధానాలు పాటించాలని సూచించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులను ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు.