హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరో వివాదానికి తెరలేపారు. రాజ్యాంగ పరిమితులను అధిగమించి మహిళా దర్బార్ నిర్వహించడమే కాకుండా, ఆ సందర్భాన్ని సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజలతో సంప్రదింపులు జరిపే ‘ప్రజాదర్బార్’లో భాగంగా గవర్నర్ శుక్రవారం ‘వినిపించని మహిళల స్వరం విందాం’ అంటూ.. ‘మహిళా దర్బార్’ నిర్వహించారు.
ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, దీనివెనుక కుట్రకోణం కనిపిస్తున్నదని ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ విమర్శించాయి. మహిళా దర్బార్‌లో గవర్నర్ మాట్లాడుతూ.. ‘ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నానని అంటున్నారు.. ఈ వ్యాఖ్యలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలి’ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన తానుచేసే విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
‘నేను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నాను. లైంగికదాడి కేసు జరిగిన తరువాతనే ఈ సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించాను. మహిళలు, మైనర్ల భద్రత విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్నాను. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. ఇటువంటి సమావేశాలు ఏర్పాటుచేయడానికి రాజ్‌భవన్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి’ అని చెప్పారు. ‘మహిళలు ఇబ్బందులు పడుతుంటే నేను చూస్తూ ఉండలేను’ అని తెలుగులో అన్నారు. రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తానని, తనను ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రజల కోసం పోరాడే తనను ఆపే అధికారం ఎవరికీ లేదు అని వ్యాఖ్యానించారు. మహిళల కోసం ఒక బలమైన శక్తిగా ఉంటానని అన్నారు.
గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహణ వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జగ్గారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలోనే ఈ సమావేశం నిర్వహించారని ఆరోపించారు. మహిళా దర్బార్ వల్ల ఎటువంటి ఫలితం ఉండదని, ఇది సమస్యలను మరింత జటిలం చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ‘సమస్యను రాజకీయం చేయడానికి బదులు, గవర్నర్‌కు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలను అతిక్రమించినవారిపై చర్యలకు ఉపక్రమించాలి’ అని సవాల్ చేశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా బీజేపీ.. భారత్‌ను పాకిస్థాన్‌లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
గవర్నర్ రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించడం రాజకీయ దురుద్దేశంతోనేనని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. గవర్నర్ సౌందర్‌రాజన్ రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం మార్గదర్శనం చేయనిదే గవర్నర్ స్వతంత్రంగా పనిచేయరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదని గుర్తుచేశారు. మహిళా దర్బార్ పక్కా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.
సీఎం కే చంద్రశేఖర్‌రావుతోపాటు టీఆర్ఎస్ నాయకులందరికీ రాజ్యాంగ వ్యవస్థపై అత్యంత గౌరవం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. కానీ గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని బీజేపీ రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గవర్నర్ పదవిలో ఉన్న తమిళిసై రాజకీయ నేతగా వ్యవహరించరాదని, ఆమె ‘లక్ష్మణ రేఖ’ దాటకూడదని హితవు చెప్పారు.
రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటుచేసిన ప్రజా దర్బార్‌కు తాము జవాబుదారీ కాదని స్పష్టంచేశారు. తమకు ఓటువేసి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు మాత్రమే తాము జవాబుదారీ అని పేర్కొన్నారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి గవర్నర్ కమలా బేనివాల్ ‘ప్రజా దర్బార్లు’ నిర్వహించినందుకు ఆమెను బర్తరఫ్ చేయాలని నాటి ప్రధాని మన్మోహన్‌కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివేకానంద గుర్తుచేశారు.