BC Students | హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల్లో చదువుకునే తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇటీవల ప్రకటించిన బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకాన్ని 2023-24 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 200కు పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించనున్నది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్, నిట్, బిట్స్ తదితర ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అదే తరహాలో దేశంలోని అలాంటి విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకూ ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఇటీవలే నిర్ణయింయించిన ప్రభుత్వం దాని అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కేంద్ర విద్యాశాఖ రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో స్థానం పొందిన టాప్-200 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇది వర్తించనున్నదని తెలిపింది. ఆయా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న ఒక్కో బీసీ విద్యార్థికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల ఫీజు చొప్పున, సంబంధిత కోర్సు ముగిసేవరకూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకం అమలు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో ప్రతి ఏటా రాష్ర్టానికి చెందిన సుమారు 5 వేల నుంచి 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశమున్నది. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది బీసీ బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు దక్కనున్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ తొలి నుంచి బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. బీసీల విద్యాప్రదాతగా నిలిచారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే ఆశయాలను కేసీఆర్ నెరవేరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ప్రభుత్వం ఫీజు చెల్లించే పథకం తేవడమే అందుకు నిదర్శనం. నేడు ఎంతో మంది పేద విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలు, కలలు నెరవేర్చుకునే అవకాశం లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా బీసీల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
– గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి
బీసీ బిడ్డల కలల సాకారానికి అన్నివిధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యావత్ బీసీ సమాజం రుణపడి ఉంటుంది. స్వదేశీ విద్యానిధి పథకానికి రూపకల్పన చేయడం చరిత్రాత్మకం. ఈ పథకం ద్వారా వేలాది మంది బీసీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవకాశం దక్కుతుంది. బడుగు, బలహీనవర్గాలపై సీఎం కేసీఆర్ చాటుతున్న గొప్ప ప్రేమకు, ఆదరణకు ఇది నిదర్శనం. బీసీల పక్షాన, బీసీ విద్యార్థుల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.
– దండ్రు కుమారస్వామి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు