హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ), డెంటల్ కౌన్సిల్(టీడీసీ) మధ్య ‘సర్జికల్’ వార్ నడుస్తున్నది. వృత్తిపరంగా, స్పెషలైజేషన్ల పరంగా ఈ రెండు శాఖలు పోటాపోటీగా ప్రకటనలు జారీ చేసుకోవడం అగ్గి రాజేసింది. ఫేషియల్ సౌందర్య ప్రక్రియలు, హెయిల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అర్హత డెంటల్ సర్జన్లకు, ఓరల్ మాక్సిల్లోఫేషియల్ (ఓఎంఎఫ్ఎస్) సర్జన్లకు ఉంటుందని వాదిస్తున్న డెంటల్ కౌన్సిల్.. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అనుమతి డెంటల్ సర్జన్లకు లేదని మెడికల్ కౌన్సిల్ చెప్తున్నది. డెర్మటాలజీ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్, ప్లాస్టిక్ సర్జరీలు చేసే వైద్యులకు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అర్హత ఉన్నదని, జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి లేకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేయొద్దని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని మెడికల్ కౌన్సిల్ వర్గాలు చెప్తున్నాయి. అయినా కొంత మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు చేయడంతో అలాంటి క్లినిక్లపై దాదాపు వంద కేసులు నమోదు చేసినట్టు మెడికల్ కౌన్సిల్ తెలిపింది. డెంటల్, హోమియో వైద్యులు ఫేక్ కాస్మోటిక్ క్లినిక్లు నడుపుతున్నట్టు తనిఖీల్లో గుర్తించామని మెడికల్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. అనుమతి లేని సర్జరీలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
డెంటల్ కౌన్సిల్ వాదన ఇదీ..
డెంటల్ కౌన్సిల్ మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అర్హత తమకు ఉన్నదని గట్టిగా చెప్తున్నది. ఇదే అంశమై ఇటీవల ఓ ప్రకటన జారీ చేసింది. ఇతర సంస్థలు, కౌన్సిళ్లు ఇచ్చే ప్రకటనలను నమ్మొద్దని ప్రజలను కోరింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిబంధనల ప్రకారం.. మాస్టర్ డెంటల్ సర్జరీ కోర్సు రెగ్యులేషన్స్లోని మూడవ అధికరణ ప్రకారం మాక్సిలోఫేషియల్ సర్జన్లు వివిధ రకాల సర్జరీలు చేయొచ్చని డెంటల్ కౌన్సిల్ వాదిస్తున్నది. సాఫ్ట్ టిష్యూ గాయాలు, ఫ్రాక్చర్లు, తుపాకీ గాయాలు, తల, మెడ భాగంలో క్యాన్సర్ సర్జరీ, క్రానియోఫేషియల్ సర్జరీ సహా పలు రకాల సర్జరీలు చేయొచ్చని తెలిపింది. ఏస్థటిక్ ఫేషియల్ సర్జరీ చేసే అర్హత తమకు ఉన్నదని ప్రకటించింది. అయితే వైద్య శాఖలోని రెండు కీలక విభాగాల మధ్య నెలకొన్న ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.