Dande Vithal | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికల చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. అయితే ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనల అనంతరం దండె విఠల్ ఎన్నికల చెల్లదని హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దండె విఠల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు స్టే విధించింది.