Suchir Balaji | న్యూఢిల్లీ, జనవరి 12: చాట్‌జీపీటీ అభివృద్ధిలో తన కుమారుడు ఎంతో కృషి చేసినప్పటికీ ఓపెన్ఏఐ సంస్థ మాత్రం తగిన గుర్తింపు ఇవ్వలేదని సుచిర్ బాలాజీ తల్లి అపర్ణారావు ఆరోపించారు. చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో సుచిర్ బాలాజీ నాలుగేండ్లు పని చేసి 2023 ఆగస్టులో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఓపెన్ఏఐ అనైతిక చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించి, పలు ఆధారాలను బయటపెట్టారు. ఈ క్రమంలో గత నవంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఈ విషయమై ఆయన తల్లి అపర్ణారావు మారియా నాఫల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మాట్లాడుతూ..‘చాట్‌జీపీటీని వేగంగా, సమర్థంగా అభివృద్ధి చేయడానికి నా కొడుకు తోడ్పడ్డాడు. కానీ తను మరణించే వరకు తన పనికి గుర్తింపు దక్కలేదనే బాధ అతడిలో ఉండేది. ఇప్పుడు కూడా సుచిర్ సేవలకు ఓపెన్ఏఐ తగిన గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం’ అని ఆమె పేర్కొన్నారు. తమ కుమారుడి మరణం ఆత్మహత్యలా లేదని, అసలు నిజాన్ని తేల్చడానికి ఎఫ్‌బీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.