EAPCET | నస్పూర్, మే 3 : ‘మౌస్ పనిచేస్తలేదని చెప్పినా స్పందించలేదు. మార్చడం వీలుకాదు అని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా నా బదులు వాళ్లే పరీక్ష రాశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 40 ప్రశ్నలకు పైగా సమాధానాలు పెట్టకుండా బయటకు రావాల్సి వచ్చింది. మరోసారి పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తా’ అంటూ మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థి తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై ఎప్‌సెట్ కన్వీనర్‌కు ఫిర్యాదు చేశాడు.
వివరాలిలా.. మంచిర్యాలకు చెందిన అనవేన అమార్ధ్య (హాల్ టికెట్ నంబర్ 2523ఎల్11078) పెద్దపల్లి జిల్లాలోని ట్రినిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో శుక్రవారం మార్నింగ్ సెషన్ పరీక్షకు హాజరయ్యాడు. అమార్ధ్యకు కేటాయించిన కంప్యూటర్ సరిగా పనిచేయకపోవడంతో ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశాడు. మౌస్‌లో సమస్య ఉన్నట్టు గుర్తించిన ఇన్విజిలేటర్ ఇప్పుడు మౌస్ మార్చే టైమ్‌లేదని, సమాధానాలు చెబితే మౌస్ ఆపరేట్ చేసి ఆన్సర్ పెడతానని పేర్కొన్నాడు. స్వయంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టాడు. కంప్యూటర్ సరిగా లేకపోవడంతో సకాలంలో సమాధానాలు రాయలేకపోయానని, మౌస్ మార్చాలని కోరినా నిర్వాహకులు మార్చలేదని విద్యార్థి వాపోయాడు.