హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) ఇసుకతోపాటు ఇతర మినరల్స్ తవ్వకాలనూ చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో ఇసుకతోపాటు సున్నపురాయి, గ్రానైట్, రెడ్ మెటల్, మాంగనీసు, డోలమైట్, లేటరైట్, మార్బుల్, కాల్సైట్, క్వార్ట్, ఫెల్డ్స్పార్, మైకా తదితర ఖనిజాల నిల్వలు అపారంగా ఉన్నాయి.
ప్రస్తుతం టీజీఎండీసీ కేవలం ఇసుక విక్రయాలు మాత్రమే నిర్వహిస్తుండగా, మిగిలిన ఖనిజాలను టెండర్ల పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తున్నది. ఆయా ఖనిజాలకు అనుమతులు పొందుతున్న కాంట్రాక్టర్లు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ఖజానాకు గండి కొడుతున్నట్టు గుర్తించారు. దీంతో ఇసుక మాదిరిగానే మిగిలిన ఖనిజాలనూ తమ ఆధ్వర్యంలోనే చేపటేలా పావులు కదుపుతున్నది.