Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆర్థికరంగ పతనం కొనసాగుతున్నది. ఓ వైపు పడిపోతున్న ఆదాయం.. మరోవైపు అంచనాలకు మించిన అప్పులతో ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కాగ్‌కు సమర్పించిన నివేదికలోనే వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలలు గడిచిపోగా.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో సగం మాత్రమే వచ్చింది. 2024-25 బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,21,242 కోట్లుగా అంచనా వేయగా, జనవరి నాటికి రూ.1,23,815 కోట్లు మాత్రమే వచ్చాయి.
అంటే రాబడి 55.96 శాతం మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే సమయానికి రెవెన్యూ రాబడులు 63.20 శాతంగా ఉండటం గమనార్హం. ఇక ఏటికేడు పోల్చిచూసినప్పుడు రెవెన్యూ రాబడుల క్షీణత కొనసాగుతున్నది. నిరుడితో పోల్చితే జనవరి నాటికి రెవెన్యూ రాబడుల్లో రూ.13,044.9 కోట్లుగా నమోదైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లలోనూ తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది రూ.58,594.91 కోట్లుగా అంచనా వేయగా రూ.42,657.9 కోట్లు వచ్చాయి. లక్ష్యంలో ఇది 72.8 శాతం. అయితే.. ఇదే సమయానికి నిరుడు జీఎస్టీ వసూళ్లు 75 శాతం నమోదైంది. బీఆర్ఎస్ పాలనలో సొంత రాబడుల వృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు బడ్జెట్ అంచనాలను చేరుకోవడానికి ఆపసోపాలు పడుతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
హైడ్రా, మూసీ సుందరీకరణ, ఎఫ్టీఎల్ పేరుతో బెదిరింపులు, విచ్చలవిడి వసూళ్లు.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంపై అనేక కోణాల్లో దాడి జరుగుతూనే ఉన్నది. ఫలితంగా 13 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం నేలకరించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జూన్‌లో హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గడం మొదలైంది. ఈ ఏడాది జనవరి నాటికి ఇది పతాక స్థాయికి చేరిందని.. రియల్ రంగం ఏకంగా నేలకరిచిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228.82 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, పది నెలలు గడిచిన తర్వాత జనవరి నాటికి రూ.5,821.88 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది లక్ష్యంలో 31.94 శాతమే. నిరుడు ఇదే సమయానికి ఖజానాకు ఆ శాఖ ద్వారా రూ.11,700 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈసారి సగానికి పడిపోయినట్టు లెక్క. కరోనా కాలంలోనూ పెద్దగా ప్రభావితం కాని రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలనలో కుదేలైందని ఆ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క రియల్ రంగంతో ఆగిపోదని, దీని ప్రభావం ఇతర రూపాల్లో ఖజానాపై కనిపిస్తుందని చెప్తున్నారు.
రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా అంచనాలకు మించి అప్పులు చేసినట్టు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది రూ.49,255.41 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో అంచనా వేసింది. కానీ, జనవరి నాటికే రూ.58,586 కోట్లు రుణాలు తీసుకున్నది. అంటే బడ్జెట్ అంచనాలను అధిగమించి 118.94 శాతం రుణాలు పెరిగాయి. ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఓవైపు ఆదాయం సృష్టించలేక.. మరోవైపు అప్పుల భారం మోపుతూ ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంటున్నదని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత లోతుల్లోకి జారిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రాబడి పెంచే మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు.