హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ నెల 4న మంత్రి ఎర్రబెల్లి 67వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. 3న ఆయన అమెరికా వెళ్తున్నందున ఆ రోజు అందుబాటులో ఉండటం లేదు.
దీంతో మంత్రి పుట్టినరోజు వేడుకలను ఉపాధి హామీ ఉద్యోగులు ముందుగానే నిర్వహించారు. మంత్రి దయాకర్‌రావుతో కేక్ కట్ చేయించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల పే స్కేల్ సవరింపు విషయమై మంత్రికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధి హామీ జేఏసీ నేతలు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.