హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు 2023 మార్చిలో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు శనివారం ప్రకటించారు. మార్చిలోనే పరీక్షలు నిర్వహిస్తామని గతంలో జారీచేసిన అకడమిక్ క్యాలెండర్లో స్పష్టంచేశామని, దాని ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.
పరీక్షా ఫీజు చెల్లింపు షెడ్యూల్ను విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 15, ఆలస్య రుసుంతో డిసెంబర్ 29 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ. 100.. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులున్న వారు సైతం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సులకు ఒక్కో సబ్జెక్టుకు రూ.60 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మొదటిసారి పరీక్షకు హాజరయ్యే వారు కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపుంటే ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందుతారు.
‘పది’లో ఏటా ఆరు పేపర్లే!
పదో తరగతి వార్షిక పరీక్షలను ఇక నుంచి ఆరు పేపర్లకే నిర్వహించే అవకాశాలున్నాయి. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించిన జీవో త్వరలోనే విడుదల కానున్నది. కరోనా నేపథ్యంలో గతంలో పది పరీక్షలను 6 పేపర్లకే నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలనే నిర్వహించలేదు. 2022లో ఆరు పేపర్లకే పరీక్షలను నిర్వహించారు. ఇప్పటి నుంచి 11కు బదులుగా ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించే అంశంపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే విడుదల కానున్నదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.